వృద్ధి వేగంలో మనమే టాప్
ముంబై, మే 30: ప్రపంచ ప్రధాన ఎకానమీలన్నింటిలో భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి సాధిస్తుందని రిజర్వ్‌బ్యాంక్ తాజా అంచనాల్లో వెల్లడించింది. స్థూల ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్ఠత కారణంగా ప్రస్తుత 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 7 శాతం వృద్ధి సాధిస్తుందని ధీమాగా చెప్పింది. గురువారం ఆర్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ అంచనాల్ని వెల్లడించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగిందని తెలిపింది. 7 శాతంపైగా వృద్ధిని నమోదుచేయడం వరుసగా ఇది మూడో సంవత్సరమని పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలిచిందన్నది. పెట్టుబడుల డిమాండ్ జోరుతో జీడీపీ వృద్ధి పెరుగుతున్నదని, ఇందుకు బ్యాంక్‌లు, కార్పొరేట్ల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్స్ మద్దతుగా నిలుస్తున్నాయని ఆర్బీఐ నివేదికలో వివరించింది.
మూలధన వ్యయంపై ప్రభుత్వం దృష్టిపెట్టడం, ద్రవ్య, ఆర్థిక, నియంత్రణా విధానాలు వివేకవంతంగా ఉండటం ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చాయని పేర్కొంది. ప్రతికూల అంతర్జాతీయ స్థూల ఆర్థిక, ద్రవ్య వాతావరణంలోనూ భారత్ సజావుగా ప్రయాణిస్తున్నదని తెలిపింది. వచ్చే దశాబ్దకాలంలో వృద్ధిని పెంచేరీతిలో ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నదని ఆర్బీఐ నివేదిక తెలిపింది. వార్షిక నివేదిక అనేది ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమర్పించే చట్టబద్ధమైన నివేదిక. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్యకాలంలో రిజర్వ్‌బ్యాంక్ కార్యకలాపాల్ని, పనితీరును ఇందులో వెల్లడిస్తారు.
ద్రవ్యోల్బణం దిగివస్తుంది
దేశంలో ప్రధాన ద్రవ్యోల్బణం మరింత దిగివస్తుందని రిజర్వ్‌బ్యాంక్ అంచనా వేస్తున్నది. 2023 ప్రధాన ద్రవ్యోల్బణం 6.7 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. దీంతో వినియోగ ధరల సూచి ఆహార, ఇంధన ధరల్ని మినహాయిస్తే 6.1 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గింది. అయితే భవిష్యత్తులో సరఫరా షాక్స్‌తో ఆహార ద్రవ్యోల్బణానికి రిస్క్‌లు ఉన్నాయని హెచ్చరించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు నిర్ణయించిన కనీస మద్దతు ధరలు అన్ని పంటలకు అయ్యే వ్యయంలో కనీసం 50 శాతం రాబడి ఇచ్చేలా ఉన్నాయని ఆర్బీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది. తమ లక్ష్యం దిశగా ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గితే వినియోగ డిమాండ్...ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతుందని నివేదిక తెలిపింది. --
ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ రూ.70.48 లక్షల కోట్లు పాక్ జీడీపీకి 2.5 రెట్లు
ఈ ఏడాది మార్చి 31 నాటికి రిజర్వ్‌బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ 11 శాతం ఎగిసి రూ.70.48 లక్షల కోట్లకు (845 బిలియన్ డాలర్లు) చేరింది. ఇది పాకిస్థాన్ మొత్తం జీడీపీ 340 బిలియన్ డాలర్లకన్నా దాదాపు 2.5 రెట్లు అధికం.2022 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ.63.44 లక్షల కోట్లు. కొవిడ్ పాండమిక్ ముందస్తు స్థాయికి తమ బ్యాలెన్స్ షీట్ చేరిందని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. 2024 మార్చి చివరినాటికి తమ బ్యాలెన్స్ షీట్ జీడీపీలో 24.1 శాతమని, అంతక్రితం ఏడాది ఇది 23.5 శాతమని వివరించింది. ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బ్యాంక్ ఆదాయం 17.04 శాతం పెరగ్గా, వ్యయం 56.3 శాతం తగ్గింది.
దీనికి తోడు విదేశీ సెక్యూరిటీల నుంచి వడ్డీ ఆదాయం పెరగడంతో ఆర్బీఐ వద్ద మిగులు భారీగా 141.23 శాతం పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తాన్నే కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని గతవారం రిజర్వ్‌బ్యాంక్ నిర్ణయించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంటింజెన్సీ ఫండ్ కింద రూ.42,820 కోట్లు కేటాయించింది. విదేశీ మారక నిల్వల లావాదేవీల ద్వారా రూ.83,616 కోట్ల లాభం ఆర్జించినట్టు ఆర్బీఐ తెలిపింది. విదేశీ సెక్యూరిటీల వడ్డీ ఆదాయం రూ.65,328 కోట్లకు పెరిగిందన్నది. దీంతో కంటింజెన్సీ ఫండ్ పరిమాణాన్ని పెంచుకునే వీలు కలిగిందని వివరించింది.






