22 April, 2026 | 10:26 PM

పీనుగలమ్ముకున్న ప్రిన్సిపాల్

22-08-2024 12:23 AM

కోల్‌కతా ఆర్జీ కర్ దవాఖాన సిబ్బంది ఆరోపణ

ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు కూడా లై డిటెక్టర్?

138 ఏండ్ల దవాఖానలో అంతులేని అక్రమాలు!

దవాఖానకు కేంద్ర బలగాలతో భద్రత

కోల్‌కతా, ఆగస్టు 21: ట్రెయినీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ దావాఖానకు సంబంధించి రోజుకో సంచలన విషయం బయటకు వస్తున్నది. 138 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వ దవాఖానలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆ దవాఖాన ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దవాఖాన ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. 

అనాథ శవాలు వస్తే సందీప్‌కు పండుగే

ఆర్జీ కర్ దవాఖానకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీకి మొన్నటివరకు ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌పై కాలేజీ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు. కాలేజీకి అనాథ శవాలు వస్తే సందీప్ ఘోష్ వాటిని అమ్ముకొనేవారని తెలిపారు. శవాల కోసం ఎవరూ రాకపోతే కొద్ది రోజులు వేచి చూసి ఆయనకు తెలిసిన ముఠాలకు వాటిని విక్రయించేవారని ఆరోపించారు. కళాశాలకు చెందిన ఔషధాలకు బంగ్లాదేశ్‌కు స్మగ్లింగ్ చేసేవారని కాలేజీలో గతంలో పనిచేసిన అక్తర్ అలీ తెలిపారు.

ఆయన ప్రస్తుతం ముర్షీదాబాద్ మెడికల్ కాలేజీ డిఫ్యూటీ సూపరింటెండెంట్‌గా ఉన్నారు. సందీప్ ఘోష్‌పై ఆయన గతంలోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా సందీప్ ఘోష్‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు అక్తర్‌ను కూడా విచారించి వివరాలు సేకరించారు. కాలేజీలో వాడేసిన సిరెంజీలు, ఇతర వైద్య పరికరాలను కూడా సందీప్ అమ్ముకొనేవాడని ఆరోపించారు. కాలేజీకి అవసరమైన వైద్య, ఇతర పరికరాల కొనుగోలు కోసం తన కుటుంబ సభ్యులు, బంధువులకే ఆర్డర్లు ఇచ్చేవాడని చెప్పాడు. సందీప్‌పై గృహ హింస ఆరోపణలు కూడా ఉన్నాయి. 

అర్హత లేకున్నా ప్రిన్సిపాల్ పోస్టు

సందీప్ ఘోష్‌కు అసలు కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యే అర్హతే లేదని ఆయనతో కలిసి పనిచేసిన వైద్యులు చెప్తున్నారు. కోల్‌కతా సమీపంలోని బొంగాన్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన.. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోనే 1994లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆర్తోపెడిక్‌లో పీజీ చేశారు. కొంతకాలం కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2021లో ఆర్జీ కర్ దవాఖాన ప్రిన్సిపాల్ అయ్యారు. ఈ పోస్టుకోసం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన 16వ స్థానంలో నిలిచారు. అయినా ఆయనకు ప్రిన్సిపాల్ ఉద్యోగం రావటంతో ఇంటర్వ్యూకు హాజరైన ఇతర వైద్యులు షాక్‌కు గురయ్యారట. 2023 జూలైలో సందీప్‌పై ఫిర్యాదు చేసిన అక్తర్ అలీని బెంగాల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ బెదిరించారని, వెనక్కు తగ్గకుంటే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తానని హెచ్చరించారని వార్తలు వచ్చాయి. 

సైన్యం కూడా సమ్మె చేస్తే ఎలా ఉంటది?: టీఎంసీ నేత

డాక్టర్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న వైద్యులపై మరో టీఎంసీ నేత నోరు పారేసుకొన్నాడు. డాక్టర్ హత్యకు గురయ్యారని డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.. మరి 2019లో పుల్వామా ఉగ్రదాడిలో సైనికులు చనిపోయారని తోటి సైనికులు సమ్మె చేశారా? అని ప్రశ్నించారు.  

కర్ దవాఖాన కొత్త ప్రిన్సిపాల్ తొలగింపు

వివాదాస్పదంగా మారిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ దవాఖాన మెడికల్ కాలేజీలో రోజుకో పరిణామం చోటుచేసుకొంటున్నది. తాజాగా ఈ కాలేజీ కొత్త ప్రిన్సిపాల్ సుహ్రితా పాల్‌ను ప్రభుత్వం ఆ పదవి నుంచి బుధవారం తప్పించింది. ఆమెను తొలగించాలని విద్యార్థులు భారీ ర్యాలీగా స్వాస్త్య భవన్‌కు వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయటంతో వెంటనే ఈ పరిణామం చోటుచేసుకొన్నది.