2 June, 2026 | 2:24 AM

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

02-06-2026 01:32 AM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, జూన్ 1(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య ని యంత్రణ మండలి రూపొందించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 గోడపత్రికను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనుగాల వెంక టరామిరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్పాయి, డాక్టర్ సత్య శారదలతో కలసి కుడా కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్యం వల్ల ఏర్పడుతున్న దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ర్యాలీలు, వీధి నాటకాలు, చర్చా వేదికలు, అవగాహన సదస్సులు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పర్యావరణ స్పృహను పెంపొందించాలని సూచిం చారు. హనుమకొండ జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్  చాహత్ బాజ్పాయి మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టం గా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పర్యావరణానికి హాని కలిగించే ఏక వినియోగ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, వాటికి ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, గాజు మరియు స్టీల్ బాటిళ్లు, విస్తర్లు వంటి సహజసిద్ధమైన, పునర్వినియోగ ఉత్పత్తులను ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. స్వచ్ఛమైన, హరితమైన పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ చురుకైన పాత్ర పోషించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కారప్స్ హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ మరియు జిల్లా సైన్స్ అధికారి ఎస్. శ్రీనివాస స్వామి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జోనల్ ప్రయోగశాల పర్యావరణ శాస్త్రవేత్త జీమూత వాహన్ తదితరులు పాల్గొన్నారు.