ఐక్యతతో అభివృద్ధి బాటలో నడపాలి
సూర్యాపేట, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : నూతనంగా ఎన్నికైన సర్పంచులు అందరి సహకారం తీసుకుంటూ ఐక్యతతో ముందుకు సాగుతూ గ్రామాలను అభివృద్ధి బాటలో నడపాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామ సర్పంచ్ ప్రమాణస్వీకారం వేడుకకు సోమవారం హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమన్నారు. ఆ ఘనత ముమ్మాటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు. ఆయన హాయంలో పదేండ్లు ఎనలేని అభివృద్ధిని సాధించిందన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామాల్లో మొదటి పది తెలంగాణ గ్రామాలేనన్నారు.
మొదటి 20 గ్రామాల వారీగా చూసిన 19 స్థానాలను తెలంగాణ గ్రామాలే కైవసం చేసుకున్నాయంటే గ్రామాల అభివృద్ధిపై కెసిఆర్ కున్న అభిమానం ఏంటో అర్థం అవుతుందన్నారు. పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం పెరిగిందని, వాటి సంరక్షణకై ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా మంచినీటి సమస్య తీర్చడంతో పాటు గ్రామానికో ట్రాక్టర్, వైకుంఠధామాలు, రోడ్లు ఇలా గ్రామానికి కావలసిన సౌకర్యాలు అన్ని పూర్తి చేశామన్నారు.
ఇన్ని సౌకర్యాలు ఉన్న గ్రామాలు దేశంలోనే మరెక్కడా లేవన్నారు. అందుకే మన తెలంగాణ గ్రామాలు అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలిచాయన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్ప.. గ్రామాలను ఐక్యతతో అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇదే కెసిఆర్ నేర్పిన అభివృద్ధి మంత్రమని ఈ మార్గంలోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తదుపరి నూతన సర్పంచ్ వార్డు మెంబర్లను సత్కరించారు..ముందుగా నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.




