20 April, 2026 | 3:27 AM

వాళ్లను ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి!

20-04-2026 01:16 AM

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో మంచి అవకాశాలు పొందుతూ కెరీర్‌ను దూసుకెళ్తున్న యువ కథానాయకి జాన్వీ కపూర్. తాజాగా ఈ బ్యూటీ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన డార్క్ షేడ్ గురించి ఆమె నిర్మొహమాటంగా మాట్లాడారు.

“మద్యానికి బానిసైన వారిని నేరస్తుల్లా చూడకండి. వారు కూడా అందరిలాంటి సాధారణ మనుషులే. మద్యానికి బానిస కావడం అనేది ఒక మానసిక ఆరోగ్య సమస్య మాత్రమే. కొంతమంది తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగా మద్యానికి అలవాటు పడతారు. ఆ తర్వాత అది పెరిగి బానిసగా మారుతారు. అలాంటి వారిని దూరం పెడితే వారు ఆ అలవాటుకు మరింత దగ్గరవుతారు. అదే ప్రేమతో దగ్గరకు తీసుకుంటే వారు ఆ చెడు అలవాటుకు దూరమయ్యే అవకాశం ఉంటుంది” అని పేర్కొంది.

ఇదే వేదికపై జాన్వీ ఇంకా మాట్లాడుతూ.. ‘నా జీవితంలో కూడా ఒకానొక సమయంలో మద్యం విలన్‌గా మారింది. మొదట సరదా కోసం మద్యం తాగడం ప్రారంభించాను. తర్వాత నేను దానికి బానిసనయ్యాను. చివరికి ఆ అలవాటు ఎంత దాకా వెళ్లిదంటే, ఉదయం లేవగానే మద్యం తాగే స్థాయికి చేరుకున్నా. ఆ సమయంలో నా మీదే నాకే అసహ్యం వేసింది. అనంతరం నేను పూర్తిగా మద్యానికి దూరమయ్యా” అంటూ తన జీవితంలోని ఒక కీలక విషయాన్ని వెల్లడించారు జాన్వీ.