19 June, 2026 | 8:12 PM

ప్రపంచ సికిల్ సెల్ డే సందర్భంగా అవగాహన

19-06-2026 06:50 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రపంచ సికిల్ సెల్ డే సందర్భంగా శుక్రవారం ఉదయం  ఉట్నూరులోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ కార్యాలయం అవగాహన కార్యక్రమాన్ని అదనపు జిల్లా వైద్య శాఖ అధికారి కుడిమేత మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా అనేది వంశపారంపర్యంగా సంక్రమించే రక్త సంబంధిత వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధి కారణంగా రక్తంలోని ఎర్ర రక్తకణాలు కొడవలి (సికిల్) ఆకారంలోకి మారి శరీరంలోని వివిధ అవయవాలకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకం కలిగిస్తాయని వివరించారు.

ఫలితంగా రోగులు తీవ్రమైన నొప్పులు, రక్తహీనత, అలసట మరియు ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, నివారణ చర్యలపై సమాచారాన్ని అందించడం, బాధితులకు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్న వైద్య సేవలను చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రభావం అధికంగా ఉన్నందున ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రామస్థాయిలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, చికిత్స విధానాలు, పోషకాహారం ప్రాధాన్యత, జన్యు సలహాలు మరియు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల గురించి పాల్గొన్న సిబ్బందికి వివరించారు. ఆశా కార్యకర్తలు మరియు ఫీల్డ్ సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు సరైన సమాచారం చేరవేసి వ్యాధి నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు.