అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తాం
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు/తలకొండపల్లి, ఏప్రిల్ 10(విజయక్రాంతి): రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందజేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆమనగల్లు మరియు తలకొండపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వేర్వేరు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మొత్తం 116 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
విద్యారంగానికి పెద్దపీట రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గాన్ని విద్యా హబ్గా మార్చడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ‘మన పిల్లలు విద్యావంతులైతే భవిష్యత్తులో పథకాల కోసం ఇతరులను అర్థించాల్సిన అవసరం ఉండదు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే రూ. 200 కోట్లతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఆమనగల్లులో పాలిటెక్నిక్ కళాశాల, రూ. 10 కోట్లతో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు,ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం కోసం 2.37 ఎకరాల స్థలం కేటాయించినట్లు గుర్తు చేశారు.
అక్రమార్కులపై కఠిన చర్యలు..
గ్రామాల్లో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసే డీలర్ల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కేసులు నమోదు చేసి, వారిని జైలుకు పంపాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి నిరంతర ప్రక్రియ
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారమైనప్పటికీ, ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉచిత కరెంటు, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అప్పుల్లో ఉన్న ఆర్టీసీని సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులు విడుదల చేసి లాభాల బాట పట్టించారని గుర్తు చేశారు. తన పదవీ కాలంలో ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు మంజూరు చేశానని, రాబోయే రెండున్నర ఏళ్లలోనియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు ఠాగూర్ బాలాజీ సింగ్, తహసీల్దార్లు పాహీం ఖాద్రీ, రమేష్, ఏఎంసీ చైర్మన్ గీతా ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




