11 April, 2026 | 3:25 AM

ఎక్వాయిపల్లి రైతులకు గ్రీన్ ఫీల్డ్ పరిహారం పంపిణీ

11-04-2026 01:18 AM

ఎకరానికి 30 లక్షల చెల్లింపు

రంగారెడ్డి, కలెక్టరేట్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): గ్రీన్ ఫీల్ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తరపున పరిహారం పంపిణీ ప్రక్రియ వేగవంతమైంది. ముద్వేన్ రెవిన్యూ పరిధిలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి బాధితులకు సంబంధించిన చెక్కులను శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల చేతుల మీదుగా అందజేశారు. ముద్వేన్ రెవిన్యూ పరిధిలోని 49 మంది రైతులకు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఎకరానికి రూ.30 లక్షల చొప్పున పరిహారాన్ని ఖరారు చేసింది.

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు రైతులకు స్వయంగా చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్ హైవే అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల ప్రయోజ నాలను ప్రభుత్వం కాపాడుతుందని తెలిపారు. ఎక్కడా ఎటువంటి జాప్యం లేకుండా, అర్హులైన ప్రతి రైతుకూ నేరుగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ భూమిని అభివృద్ధి పనులకు అందించిన రైతుల సహకారాన్ని ఆయన అభినందించారు. 

రైతుల్లో హర్షం...

చాలా కాలంగా ఎదురుచూస్తున్న భూ పరిహారం నగదు అందడంతో ముద్వేన్ రైతులు హర్షం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో పరిహారం అందించినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రహదారి రాకతో ప్రాంతీయ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు పాలకూర్ల కరుణాకర్ గౌడ్, ఈర్లపల్లి రవి,డీటీ విజయ్, ఆర్ ఐ సందీప్ లు పాల్గొన్నారు.