12 May, 2026 | 7:39 PM

తెలంగాణను కొత్తగా పరిచయం చేస్తాం

29-08-2024 03:21 AM
  1. పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 
  2. థాయ్‌లాండ్ పసిఫిక్ ఆసియా ట్రావెల్ మార్ట్‌కు హాజరు 
  3. తెలంగాణ పర్యాటక సంస్థ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని, టూరిజం గమ్యస్థానంగా మారుస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. థాయ్‌లాండ్ రాజధాని  బ్యాంకాక్‌లోని క్వీన్ సిరికిట్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్ (పాటా ట్రావెల్ మార్ట్ జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. 45 దేశాలకు చెందిన 900 మంది ప్రతినిధులు దీనికి హాజరవ్వగా.. భారత్ నుంచి తెలంగాణతోపాటు మరో 5 రాష్ట్రాలు పాల్గొన్నా యి. ఈ ట్రావెల్ మార్ట్‌లో తెలంగాణ పర్యాటకశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్‌ను మంత్రి జూపల్లి ప్రారంభించారు.

రాష్ర్టంలోని పలు చారిత్రక, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, స్థలాల ప్రాశస్త్యాన్ని అంతర్జాతీయంగా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ పర్యాటక సంస్థ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, హైదరాబాద్‌లోని చార్మి నార్, ములుగు జిల్లాలోని లక్నవరం తీగల వంతెన ఛాయా చిత్రాలను ప్రదర్శించింది. థాయ్‌లాండ్‌లో భారత అంబాసిడర్ నగేష్ సింగ్, థాయ్‌లాండ్  పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మలినీ, ఇండియా చాప్టర్ పాటా- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రణీఫ్ సన్షా, వివిధ దేశాల ప్రతినిధులను మంత్రి జూపల్లి కలిశారు.

తెలంగాణలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, గోల్కొం డ కోట,  వరంగల్ కోట, కాకతీయ తోరణం, చార్మినార్, కుతుబ్ షాహీ సమాధులు, ఆసి యా ఖండంలో అతిపెద్ద బుద్ధిజం ప్రాజెక్ట్ బుద్ధవనం, వేయి స్తంభాల గుడి, ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన పోచంపల్లి వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలను చూసేందుకు రావాలని మంత్రి జూపల్లి వారిని ఆహ్వానించారు. 

చరిత్ర, సంస్కృతి వారసత్వ కేంద్రంగా తెలంగాణ

ప్రపంచంలో ఏ దేశానికీ లేనన్ని సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యావరణ ప్రాంతాలు భారతదేశానికి అందులోనూ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయని మంత్రి జూపల్లి అన్నారు. ఈ ట్రావెల్ మార్ట్ ద్వారా తెలంగాణ పర్యాటక అందాలను  ప్రపంచానికి తెలియజేసే అవకాశం దక్కిందని తెలి పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు థీమ్ ఆధారిత బుద్ధిస్ట్ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్ మొదలైన వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. 

తెలంగాణ ప్రభుత్వ నూతన పర్యాటక విధానంలో ఇలాంటివాటికి సరైన ప్రాధా న్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆసియా -పసిఫిక్ ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, పసిఫిక్ దేశాల మధ్య సహకారాన్ని చర్చించడం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, దీని ఫలితంగా పర్యాటకులను ఆకర్షించి పరస్పర ప్రయోజనం పొదడమే లక్ష్యంగా పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్‌ను నిర్వహిస్తున్నది. 27వ తేదీ నుంచి 29 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.