12 May, 2026 | 6:37 PM

కడిగిన ముత్యంలా బయటపడుతా

29-08-2024 06:16 AM
  1. ఎప్పటికైనా న్యాయం, ధర్మమే గెలుస్తుంది 
  2. ప్రజా క్షేత్రంలో బలంగా పని చేస్తా 
  3. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టీకరణ 
  4. శంషాబాద్‌లో కవితకు ఘన స్వాగతం  
  5. మార్మోగిన జై తెలంగాణ నినాదాలు 
  6. ర్యాలీగా బంజారాహిల్స్ నివాసానికి 
  7. తండ్రిని కలిసేందుకు నేడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి

హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 28 (విజయక్రాంతి)/రాజేంద్రనగర్: ‘ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడుతా’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితకు బెయిల్ రావడంతో బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి భర్త అనిల్‌కుమార్, కుమారుడు ఆదిత్య, సోదరుడు కేటీఆర్, బీఆర్‌ఎస్ శ్రేణులతో చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కవితకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘసస్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకోగా.. తల్లి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి.. సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు. అనంతరం ఆమె తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజా క్షేత్రంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంకా బలంగా పని చేస్తానని తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవిత ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తన తండ్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు.  

గులాబీ పూల వాన

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌కు చేరుకున్న కవితకు బీఆర్‌ఎస్ శ్రేణులు గులాబీ పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు, నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఎయిర్‌పోర్టులో కోలాహలం నెలకొంది. జై తెలంగాణ, కవిత జిందాబాద్ నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అని నినదించారు. కార్యకర్తలకు అభివాదం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి భారీ వాహన శ్రేణితో కవిత నేరుగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి తరలివెళ్లారు. కవిత రాక సందర్భంగా ఆమె ఇంటి వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు డ్యాన్సు లు, డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు.

ట్రయల్ కోర్టుకు కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ ఇవ్వటంతో తీహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత బుధవారం ఇదే కేసులో ట్రయల్ కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టుకు వర్చువల్‌గా హాజరయ్యారు. ఆమెతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో సెప్టెంబర్ 4 లోగా డిఫెన్స్ న్యాయవాదులు అడిగిన దస్తావేజులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.