మంత్రి కోమటిరెడ్డి ఇంటిని ముట్టడిస్తాం
- వెంకటరెడ్డి కాదు.. పిచ్చిరెడ్డి
వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి
బీసీ సంఘాల జేఏసీ హెచ్చరిక
ముషీరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): ఇటీవల అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చిట్‌చాట్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్‌ను తొలగించి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే రానున్న ఎన్నికల్లో 100 సీట్లు వస్తాయన్న వ్యాఖ్యలను బీసీ సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాదు.. ఆయనో పిచ్చిరెడ్డి అని మండిపడ్డారు. బీసీలను అనగదొక్కడానికి కోమటిరెడ్డి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, బీసీలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోమటిరెడ్డి అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు అసెంబ్లీకి కొంతమంది ఊగుతూ, తూలుతూ వస్తున్నారని, నిజంగానే అందరికీ బ్రీతింగ్ ఎనలైజింగ్ టెస్ట్ చేయాలని డిమాండ్‌చేశారు.
బీసీల పట్ల అవమానకరంగా మాట్లాడిన కోమటిరెడ్డి క్షమపణ చెప్పకుంటే భువనగిరిలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడంతోపాటు మంత్రి కోమటిరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, బీసీ జేఏసీ కో చైర్మన్ పిట్ల శ్రీధర్, బీసీ సంఘాల నేతలు కోల జనార్దన్‌గౌడ్, ఈడిగ శ్రీను, నరసింహనాయక్, వీరస్వామి, మల్లు రవికుమార్, ఉదయ్ నేత, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.




