ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిపై నిరాధార ఆరోపణలు సహించబోము
చైర్పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు, కాంగ్రెస్ నాయకులు
కోదాడ,(విజయక్రాంతి): ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అవినీతి ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించకపోతే సహించబోమని మున్సిపల్ చైర్‌పర్సన్ కుసుమ, కాంగ్రెస్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు సవాల్ విసిరారు. సోమవారం పట్టణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఇతరులపై విమర్శలు చేసే ముందు తన హయాంలో జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పాలని సూచించారు.
మట్టికి టోకెన్లు పెట్టి అమ్ముకున్న చరిత్ర ప్రజలకు తెలుసని, ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకుంటూ పరిపాలన సాగించారనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు గత పాలనపై విసుగు చెంది మార్పును కోరుకున్నందుకే ఓటుతో తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజల్లో గుర్తింపు కోసం అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నాయకత్వంలో కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, వాటిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.






