28 April, 2026 | 2:22 AM

దళితులను తక్కువోడు అంటే ఊరుకునేది లేదు: ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్

28-04-2026 12:38 AM

జుక్కల్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో సోమవారం  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు అంబేద్కర్ యువజన సంఘం కార్యవర్గ సభ్యులు తెలిపారు. గ్రామంలో అందరి సహకారంతో గత 30 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ముఖ్య అతిథిగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్. డాక్టర్. గాలి వినోద్ కుమార్ హాజరై మాట్లాడారు.

ఇప్పటికీ దళితులను చిన్నచూపు చూస్తున్నారని పలు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. దళితుల పట్ల ఎవరైనా చిన్నచూపు చూస్తే ఊరుకోరాదని తక్కువోడు అంటే చెంప చెల్లుమనిపించేలా చూడాలన్నారు. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదని ఎవరైనా అంటే తన వద్దకు వస్తే నేను అనుమానాల్ని తీరుస్తానని పేర్కొన్నారు. అంబేద్కర్ తన జీవితాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టి బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల నిరుపేదలకు ఎన్నో రిజర్వేషన్లు కల్పించారన్నారు.

అంతకుముందు మండలం, నియోజకవర్గం లోని బహుజన విద్య వేత్తలు, మేధావులు, కళాకారులు, వక్తలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను జయప్రదం చేశారు. జయంతి సందర్భంగా గ్రామంలోని వీధుల గుండా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం పంచశీల జెండా ఆవిష్కరణ, సభ, సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్య అతిథుల ప్రసంగాలు చేశారు. ఇందులో ఎస్సీ సర్పంచులు బీసీ మైనారిటీ ఆ నాయకులు విద్యావేత్తలతో పాటు గ్రామ సర్పంచు రమణ సురేష్ గుండా, సిహెచ్ గంగారాం, గోపాల్, సీమ గంగారాం, తుకారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.