అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
ఏటూరునాగారం, మార్చి1 (విజయక్రాంతి): అర్హులైన నిలువ నీడలేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు మంజూరు చేస్తామని, మంజూరైన ఇండ్లను త్వరితగతిన నిర్మించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కొండాయి గ్రామానికి చెందిన 90మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను, ఏటూరునాగారం మండలనికి చెందిన 38మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొండాయి గ్రామంలో పార్టీలకు అతీతంగా 90 మందికి ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, 16 కోట్ల రూపాయల నిధులతో పటిష్టంగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మహిళా సంఘం లో సభ్యురాలుగా ఉంటే ఇంటి నిర్మాణానికి తక్షణమే లక్ష రూపాయల రుణాన్ని అందించడం జరుగుతుందని అన్నారు.
కొండాయి గ్రామం జంపన్నవాగు పరివాహక ప్రాంతంలో ఉన్నందున మంజూరు అయిన ఇండ్లను సురక్షిత ప్రాంతంలో నిర్మించుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వం ములుగు ప్రాంతాన్ని గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా సంక్షేమ పథకాలకు అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనన్నారు.




