7 May, 2026 | 1:24 AM

తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం

07-05-2026 12:00 AM

కలెక్టర్ రాహుల్ శర్మ 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 6 (విజయక్రాంతి): అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని, రైతులు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం మహాదేవపూర్ మండలంలోని మహదేవ పూర్, సూరారం గ్రామాలలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిస్థితిని స్వయంగా పరిశీలించి,  రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందొద్దని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కాటారంలోని అన్నపూర్ణ  పారబాయిల్ రైస్ మిల్ తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి ప్రక్రియలో ఎలాంటి జాప్యం కాకుండా  పర్యవేక్షణకు మిల్లుల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.

అలాగే కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  నిల్వ లేకుండా కేటాయించిన రైస్ మిల్లులకు వెంటనే రవాణా చేయాలని డీఎంకు సూచించారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం రవాణాకు లారీలు అందుబాటులో ఉంచాలని,  ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాస్పోర్ట్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ డీఎం రాములు, ఎంపిడిఓ రవీందర్,  పీఎసీఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.