2 September, 2026 | 1:39 AM

డ్యాన్సర్స్‌ను విడదీయాలని చూస్తే ప్రతిఘటిస్తాం

02-09-2026 | 12:41am

కొత్త కార్యవర్గాలు చట్టపరంగా చెల్లుబాటు కావు 

తెలుగు ఫిల్మ్, టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతదేవి 

సినిమా బ్యూరో, విజయక్రాంతి: రఘు మాస్టర్ ఆధ్వర్యంలో కొందరు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టీఎఫ్‌టీడీఏ)కు కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం చెల్లదని ఆ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతదేవి(Sumalatha Devi) అన్నారు. తాము ఆ కార్యవర్గాన్ని గుర్తించడం లేదని స్పష్టం చేశారు. ‘టీఎఫ్‌టీడీఏ’లో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో సుమలతదేవి మంగళవారం మీడియాతో మాట్లాడారు.

“కొంతమంది పెద్దలే మా యూనియన్‌ను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఒక వర్గం ఏర్పాటు చేసుకున్న కార్యవర్గం అధికారికం కాదు. ఎలాంటి లీగల్ నోటీసు ఇవ్వకుండా మా కార్యవర్గాన్ని నాన్-ఆఫీషియల్ అని ఎలా ప్రకటిస్తారు? అసోసియేషన్‌కు సంబంధించి రూ.36 లక్షల అవినీతిపై తుది నివేదికను ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించినందుకే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.

మా యూనియన్ సమస్యపై నిర్ణయం తీసుకునే అధికారం మా సభ్యులకే ఉంది. మేము ఫెడరేషన్‌తోనే ఉంటాం. మా సమస్యను ఫిల్మ్ ఛాంబర్, మెగాస్టార్ చిరంజీవి, సురేశ్‌బాబు, దిల్ రాజు, అశోక్, రాందాస్.. వంటి సినీ పెద్దలు పరిష్కరించాలి. మా యూనియన్ ఐక్యతను దెబ్బతీసేవారికి గట్టిగా బుద్ధి చెబుతాం” అని సుమలతదేవి అన్నారు. 

వల్లభనేని అనిల్ రాజకీయాలు మానుకోవాలి: జీ బాలకృష్ణ 

టీఎఫ్‌టీడీఏ ప్రధాన కార్యదర్శి జీ బాలకృష్ణ మాట్లాడుతూ.. “మా జనరల్ బాడీ సమావేశంలో సభ్యులు తీసుకున్న తీర్మానాలు చెల్లవని చెబుతున్నారు. ఫెడరేషన్ తరఫున చెప్పే నిబంధనలు మా విషయంలో ఎంతవరకు వర్తిస్తాయో స్పష్టం చేయాలి. మేమేమైనా సంఘ విద్రోహ శక్తులమా? మమ్మల్ని ఎందుకు విడదీస్తున్నారో వల్లభనేని అనిల్ చెప్పాలి. రాజకీయాలు చేయకుండా మమ్మల్ని కలపాలి” అని తెలిపారు. 

జనరల్ బాడీ నిర్ణయమే కీలకం: అడ్వకేట్ బాల 

ఈ సందర్భంగా అడ్వకేట్ బాల మాట్లాడుతూ.. “లీగల్‌గా సుమలత నేతృత్వంలోని కార్యవర్గమే కొనసాగాలి. అసోసియేషన్‌లో జనరల్ బాడీ తీసుకునే నిర్ణయమే అత్యంత కీలకం. యూనియన్‌లో తలెత్తిన సమస్యలు పరిష్కరించేందుకు ఫెడరేషన్, పెద్దలు మధ్యవర్తిత్వం చేయవచ్చు. కానీ, తమంతట తాము ఎన్ని కొత్త కార్యవర్గాలు ఏర్పాటు చేసుకున్నా అవి చట్టపరంగా చెల్లుబాటు కావు” అని స్పష్టం చేశారు.