calender_icon.png 10 December, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌పై పోరాటం షురూ చేస్తాం

08-12-2025 12:54:05 AM

  1. బీఆర్‌ఎస్ తరహాలోనే అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్

రానున్న రోజుల్లో ప్రజల అగ్రహానికి గురికాక తప్పదు

మంత్రివర్గంలో సమన్వయం లేకనే సమన్వయ సమావేశాలు

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి

నల్లగొండ, డిసెంబర్ 7( విజయక్రాంతి): కాంగ్రెస్‌పై రానున్న రోజుల్లో బీజేపీ పోరాటం చేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో మార్పు లేదని, కేసీఆర్ పోయిండు, రేవంత్ వచ్చిండన్నారు. కేసీఆర్ హయాంలో నియంత పాలన కొనసాగిందన్నారు.

ఆరు గ్యారంటీలు ఏ ఒక్క వర్గానికి ఉపయోగపడ్డాయో, ఏ మొహం పెట్టుకొని వారోత్సవాలు జరుపుకుంటున్నారని ఆయన కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ పాలన సాగిస్తుందన్నారు.

కేసీఆర్ కేంద్రీకృతమైన అవినీతికి పాల్పడ్డాడని, రేవంత్, మంత్రులు వికేంద్రీకృత అవినీతికి పాల్పడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో ఏం సాధించిందని, ఇంకా మూడు సంవత్సరాలలో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ఏం చేశారు, బీసీలకు లక్ష కోట్లు ఏమయ్యాయి, బీసీ డిక్లరేషన్ ఎక్కడ పోయిందని విమర్శించారు.

2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని, విద్యా భరోసా కార్డ్ లు ఎప్పుడు అమలు చేస్తారని, రైతులు పండించే 10 రకాల పంటలకు రూ.500 బోనస్ ఉత్త మాటగానే మిగిలిందన్నారు.రేవంత్ ప్రభుత్వం విపరీతంగా భూ దండాలు నిర్వహిస్తుందని, కేసీఆర్ కేంద్రీకృతమైన అవినీతికి పాల్పడ్డాడు అన్నారు. రేవంత్ దిగజారి అదే బాటలో నడుస్తున్నాడని కిషన్‌రెడ్డి ఆరోపించారు. 

మద్యం దందాతో ప్రభుత్వం నడుస్తుందని, విపరీతంగా బెల్ట్ షాపులు పెరిగిపోయాయని, మద్యంతో రాష్ట్రానికి 70 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, ఎవరి కొంపలు ముంచుతారన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, రిటైర్డ్ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం చెల్లించడంలో విఫలం చెందిందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం రు.1,50 లక్షా 50 వేలు ఇస్తుందని,అదేవిధంగా సన్నబియానికి రూ.43 కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. తెలంగాణలో ఎంత మంది మహిళలకు రూ.2,500 చెల్లించారో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, గోలి మధుసూదన్ రెడ్డి, వేరేల్లి చంద్రశేఖర్, శ్రీనివాస్ గౌడ్,పాలకూరి రవి, గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు.