30 August, 2026 | 1:38 PM

కనకదుర్గ కాలనీ పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతాం

30-08-2026 12:01 PM

 ఎంపీ డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కనకదుర్గ కాలనీ పార్కు, కమ్యూనిటీ సెంటర్‌ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం సందర్శించారు. పార్కులోని వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, లైటింగ్, పచ్చదనం, మొక్కల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పార్కుకు వచ్చిన వాకర్స్, స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలు, వారి అవసరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, కనకదుర్గ కాలనీ పార్కును ఆధునిక సౌకర్యాలతో మోడల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. వర్షాకాలంలో వాకింగ్ ట్రాక్‌పై నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. చిన్నారులకు ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలని, పిల్లలు ఆడుకునేందుకు పార్కులో ప్రత్యేక ఆటస్థలాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు. చిన్నారుల వయసుకు అనుగుణంగా వివిధ ఆట పరికరాలను ఏర్పాటు చేసి, సురక్షితమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. కుటుంబాలతో కలిసి పార్కుకు వచ్చేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రూపొందించాలని పేర్కొన్నారు.