02-02-2026 12:21:39 AM
ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి): గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ విస్తృతంగా పోటీ చేసి గణనీయమైన విజయాలు సాధించిందని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తెలిపారు. ప్రజల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 17 స్థానాలను పార్టీ కైవసం చేసుకుందని తెలిపారు.
చొప్పదండిలో 1, పెద్దపల్లిలో 1, రామగుండంలో 9, కరీంనగర్లో 3, జగిత్యాలలో 1, రాయికల్లో 2 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించిందన్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా 230 మంది అభ్యర్థులను బరిలో దింపినట్లు వెల్లడించారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని, ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూస్తున్నారని అన్నారు. కరీంనగర్లో బీఆర్‌ఎస్, బీజేపీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ ను మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని అంబటి జోజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.