అప్పుల బాధతో నేత కార్మికుడి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): చేతిలో పనులు లేక చేసిన అప్పులు తీరక ఓ నేత కార్మికుడు యాసిడ్ తాగి బలవన్మరణం పాల్పడిన విషాదఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధి 11 వార్డు రాజీవ్ నగర్ కు చెందిన కుడిక్యాల నాగరాజు (45) మరమగాలు (పవర్లూమ్) నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. నాగరాజు గత ఆరు నెలలనుండి ఉపాధి లేకపోవడంతో మనస్తాపం చెందాడు. రూ. 4 లక్షల అప్పు అయ్యిందని, ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయికి కాలేజి ఫీజు ఎలా కట్టాలని తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక శుక్రవారం రాత్రి బాత్రూంలో వాడే యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






