అలుగు తెగి పదహారేళ్లు!
- వెంకూర్ చెరువు ఆయకట్టు రైతుల ఆందోళన
ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోక ఆవేదన
నిర్మల్, జూన్ 21 (విజయక్రాంతి) : పెద్దపెద్ద ఆనకట్టల మీదున్న శ్రద్ధ చిన్నచిన్న చెరువు కట్టల మీద ప్రభుత్వాలకు లేకుండా పోతోంది. సాగునీటికి భరోసా కల్పిస్తామని చెబుతున్న పాలకుల గొప్పలకు చెరువు గట్ల మీద పెరుగుతున్న తుమ్మలు, తుప్పలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కోట్లు పోసిన కట్టిన అలుగు తెగి పదహారేళ్లవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. 2007లో శ్రీరాంసాగర్‌లో పూడిక నియంత్రణలో భాగంగా కుంటాల మండలం వెంకూర్, ఓలా శివారుల్లో రూ.2.47 కోట్లతో చెరువు కట్ట నిర్మాణం చేపట్టారు. నాణ్యతలోపమో, విధి వైపరీత్యమో ఏడాది తిరిగే సరికి అలుగు తెగింది. చెరువు అడుగు మిగిలింది. ఇప్పటికీ పదహారేళ్లు గడుస్తున్నా అలుగు మరమ్మతులో, పునర్నిర్మాణమో.. అసలు అటువైపు చూసిన వారే లేకుండా పోయారు.
తుమ్మలు, తుప్పలు..
వెంకూర్ చెరువు కట్ట అలుగు మొత్తం కొట్టుకపోవవంతో చుక్కనీరు నిల్వ లేకుండాపోయింది. వరద నీరు మొత్తం వృధాగా పోతోంది. చెరువు కింద 25 ఎకరాల శిఖం భూమి ఉన్నట్లు అధికారులు తెలిపారు. చెరువులో నీరు లేకపోవడంతో కట్ట వెంబడి చెట్లు, పొదలు పెరిగాయి. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టిపెట్టి చెరువు అలుగును పునర్నిర్మించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
16 ఏండ్ల నుంచి చెబుతున్నాం
చెరువు కట్ట కడుతుంటే ఎంతో సంతోషించాం. కానీ, కట్టిన ఏడాదిలోపే వరదలు వచ్చి 20 మీటర్ల చెరువు కట్ట, అలుగు రాతి కట్టడం పూర్తిగా ధ్వంసమయ్యాయి. 16 ఏండ్ల నుంచి అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. పంటలు వేసుకోలేక, ఉన్న భూమి చెరువులో పోవడంతో రెండింటికీ నష్టపోతున్నాం.
గణపతిరావు, వెంకూర్, రైతు
ఎన్నికల హామీగానే మిగిలిపోతున్నది
చెరువు కట్ట కట్టిన ఏడాదిలోనే తెగిపోయింది. మరమ్మతుల గురించి పట్టించుకునే వారే లేరు. ఎన్నికలప్పుడు కట్టిస్తామని చెబుతున్నా ఇప్పటివరకు దానిపై దృష్టి సారించే వారే లేరు. ముఖ్యమంత్రులు, మంత్రులకు విన్నవించినా నిధులు ఇంత వరకు మంజూరు కాలేదు. చెరువు కట్ట నిర్మాణంపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం రైతులకు అన్యాయం చేయడమే.
రాధాకృష్ణ, కుంటాల
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా..
కుంటాల మండలం వెంకూర్ శివారులో నిర్మించిన ఈ అలుగు ధ్వంసమైన విషయాన్ని ఆయకట్టు రైతులు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి, ఆ తర్వాత కేసీఆర్, హరీశ్‌రావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. అలుగును తిరిగి నిర్మించి ఆయకట్టుకు నీరందించేలా చూడాలని విన్నవించారు. వారి విజ్ఞప్తులు అమాత్యుల చెవిన పడలేదేమో.. ఇప్పటికీ ఆ అలుగు అలాగే ఉంది. ఏటా వచ్చే వరదలకు కోతకు గురవుతోంది. ప్రస్తుతం 20 మీటర్ల మేర కోతకు గురైనట్లు రైతులు చెబుతున్నారు. సుమారు 25వేల ఎకరాల్లో పంటలు వేయలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా ఈ చెరువు అలుగును పునర్నిర్మించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






