పోడు సాగుదారులకు హక్కు పత్రాలివ్వాలి
అటవీ అధికారుల దాడులు ఆపాలని కలెక్టరేట్ ముట్టడి
మంచిర్యాల, జూన్ 18 (విజయక్రాంతి): జిల్లాలోని పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోడు సాగుదారులందరికి హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టీఏజీఎస్), తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనం సచిన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆదివాసీలు, ఇతర పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా ని, ప్రభుత్వం కొంత మందికి మాత్రమే హక్కు పత్రాలు అందజేసిందన్నారు. ఈ ఏడాది అటవీ శాఖ అధికారులు హక్కు పత్రాలు ఉన్నవారిని సైతం భూములు సాగు చేసుకోనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జన్నారం మండలం తపాల్‌పూర్‌కు చెందిన ఆత్రం రాజన్నను జైలుకు పంపారని, అలాగే కోటపల్లి మండలం లింగన్నపేటకు చెందిన బాగాల చంద్రయ్య, బాగాల మల్లయ్య.. తమ భూమిని దున్నుతుండగా అరెస్టు చేసి రెండు రోజులు తమ కార్యాలయంలో బందించారని ధ్వజమెత్తారు. ఇకనైనా పోడు సాగుదారులందరికి హక్కు పత్రాలు ఇవ్వాలని, హక్కు పత్రాలున్న వారు దున్నుకు నేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో ఆయా సంఘాల బాధ్యులు బండారు రవికుమార్, ఎర్మ పున్నం, రాజన్న, లక్ష్మి, అబ్దుల్లా, చిన్నరాజు, సునీత తదితరులు పాల్గొన్నారు.






