7 March, 2026 | 1:02 PM

రావణకాష్టంగా పశ్చిమాసియా!

06-03-2026 12:00 AM

ఇరాన్‌లో రగిలిన రావణకాష్టం భవిష్యత్తులో అమెరికా, ఇజ్రాయె ల్ దేశాలపై ప్రతీకారానికి ఆజ్యం పోసిందనే చెప్పవచ్చు. అత్యంత అధునాతన ఆ యుధాలు కలిగిన అమెరికా, ఎంతో సాం కేతిక పరిజ్ఞానం గల ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ పేర్లతో ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం వల్ల ప్రపంచం నాశనమవుతుందని ఆరోపణలు చేస్తూ వచ్చింది.

ఈ క్రమంలోనే ఇరాన్‌కు సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీని మట్టుబెట్టడం సమంజసమైన చర్య ఎంతమాత్రం కాదు. దాడులతో ఇరాన్ పౌరులు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పి, సంతోషం గా జీవించగలరని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్య లు వారి గాయాలపై ఆయింట్‌మెంట్ పూ యడంలాంటి కంటి తుడుపు చర్యగానే భా వించాలి. ఖమేనీ లేకుండా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కేవలం కొద్ది రోజులకే ముగియడం తథ్యం.

ఈ కారణంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమే నీ లేని ఇరాన్ తమను ఏమీ చేయలేదని బీరాలకు పోతున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)సైన్యం, పోలీసులు, ప్రజలు కలసికట్టుగా ఇరాన్‌ను పునర్మించుకోవాలని తన సోషల్ మీడి యా ‘ట్రూత్’ ద్వారా ఉచిత సలహా ఇవ్వ డం జరిగింది. అయితే అమెరికాను ఎదిరించిన ఖమేనీ కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే మృత్యువాత పడడం నమ్మశక్యంగా అనిపించడం లేదు. శాటిలైట్ సహా యంతో ఖమేనీ స్థావరాన్ని గుర్తించి పదు ల సంఖ్యలో బాంబర్లను వేసి హతమార్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. 

పంతాలతో అనర్థమే!

అయితే ఖమేనీ మరణవార్తను ధృవీకరించిన ఇరాన్ ఇందుకు ప్రతిగా అమెరికా, ఇజ్రాయిల్ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. దాదాపు 36 ఏళ్ల పాటు ఇరాన్‌ను పాలించిన ఖమే నీ శకం ముగిసింది. అయితే మానవ హక్కులను తుంగలో తొక్కడం, అమానవీయ పద్ధతుల్లో వేలాది మందిని వధిం చడం, మహిళలు హిజాబ్ ధరించకపోతే చంపడం, నిరసనకారుల హత్య, కరుడుగట్టిన మత ఛాందసవాదంతో ప్రజల స్వేచ్చ ను కాలరాశారన్న అపవాదు ఖమేనీపై ఉండేది.

అంతేకాదు హమాస్, హెజ్బొల్లా వంటి తీవ్రవాద సంస్థలకు మద్దతిచ్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో సుప్రీం లీడర్‌గానే గాక మతపెద్ద హోదా కలిగిన ఖమేనీ మరణంతో ఇరాన్ సమర్ధవంతమైన నాయకత్వాన్ని కోల్పోయిందని కొంతమంది కంటతడి పెట్టిన దృశ్యాలు కనిపించాయి. ఇకపోతే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. అయి తే ఇరాన్- అమెరికా సంఘర్షణ కొద్దిరోజుల్లోనే తెరపడవచ్చనే సంకేతాలు కూడా వస్తున్నాయి. యుద్ధంలో పాల్గొంటున్న ఆయా దేశాల వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోయే అవకాశముంది.

దీంతో పాటు యుద్ధం ఇలాగే కొనసాగితే చమురు సం క్షోభం తలెత్తే ప్రమాదం లేకపోలేదు. చమురు సరఫరాకు ఇతర మార్గాలను అన్వేషించేందుకు అవకాశాలున్నా ప్రపంచంలో 20 శాతం చమురు హోర్మూజ్ జలసంధి మార్గం గుండానే రావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యు ద్ధం ఆపబోయేది లేదని ఇరాన్ భీష్మించుకు కూర్చోవడం, అటు అమెరికా, ఇజ్రాయెల్‌లు కూడా తమ పంతం వీడకపోవడంతో పశ్చిమాసియా రావణకాష్టం లా మండిపోతున్నది. 

చమురుపై ఆందోళన!

ఇక చమురు విషయంలో రష్యా వద్ద కొనుగోలు చేయొద్దని భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. యు ద్ధం ఇలాగే కొనసాగుతూ పోతే భారత్ చమురు కోసం రష్యా వంటి మిత్రదేశాల సహకారం తీసుకోక తప్పదు. ఇప్పటికే రష్యా సహా చమురు నిక్షేపాలు కలిగిన దేశాలు తాము సరఫరా చేసేందుకు సిద్ధం గా ఉన్నట్లు ప్రకటించాయి. మరి రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని భారత్ పై ఒత్తిడి తీసుకొచ్చిన అమెరికా, మన చమురు సమస్యకు పరిష్కారం మార్గం చూపించాల్సిన అవసర ముంది. ఏది ఏమైనప్పటికీ ప్రపంచంలో పలు దేశాల మధ్య నెలకొంటున్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకొని యుద్ధాలకు దారితీస్తున్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణకు తెరపడాల్సిన అవసరముం ది. లేకపోతే పశ్చిమాసియాలో శాం తి నెలకొనదు. ఖమేనీని అంతమొందించామని అమెరికా-, ఇజ్రాయెల్‌లు సంబరప డుతున్నప్పటికీ భవిష్యత్తులో రాబోయే పరిణా మాలు ఈ రెండు దేశాలకు తీవ్ర నష్టం కలిగించవచ్చు. ముఖ్యంగా అమెరికా కంటే ఇజ్రాయెల్‌కు హమాస్, హె జ్బొల్లా వంటి సంస్థల నుంచి తీవ్రమైన ముప్పు ఉండే అవకాశముంది. గతంలో వరల్ ట్రేడ్ సెం టర్‌పై జరిగిన దాడిని అమెరికా గుర్తుంచుకోవాలి. ట్రంప్‌పై పలుమార్లు హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి.  

గల్ఫ్ దేశాలకు నష్టం..

-ఇరాన్‌తో యుద్ధం వల్ల అమెరికాపై ఆర్ధికభారం పెరగడంతో పాటు సైనికులను కోల్పోవాల్సి వస్తున్నది. మరోవైపు ఇరాన్ కూడా దాడుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతూ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతున్నది. అయితే ఇది అమెరికా కన్నా ఎక్కువగా గల్ఫ్ దేశాలకు తీరని నష్టం చేకూరుస్తున్నది. పంతాలకు పోయి ఇరాన్ తాను నాశనమవుతూ ఇతర దేశాల వినాశనమే ధ్యేయంగా యుద్ధం చేస్తుండడం కూడా మంచి పరిణామం కాదు.

అహం,ఆధిపత్యం వంటి మూర్ఖ భావజాలమే ప్రపంచ ప్రజలను ప్రశాంతంగా జీవించనీయడం లేదు. అణ్వస్త్రాల ఆధిపత్య ధోరణి కోసం అమెరికా వంటి దేశాలు పరాయి దేశాలపై దాడులు చేయ డం తగదు. కొన్ని దేశాల నిర్ణయాలు, ని యంతృత్వ భావాలు,మత ఛాందసవాదం ప్రపంచంలో యుద్ధాలను ప్రేరేపి స్తున్నా యి. వినాశనం సృష్టిస్తున్నాయి. తాము చేయని తప్పుకు ఎన్నో దేశాల ఆర్థి క వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతున్నాయి.

రక్తపా తంతో రావణకాష్టం సృష్టిస్తూ మారణహోమం కొనసాగిస్తున్న ప్రపంచంలోని కొన్ని దేశాల వైఖరికి అమాయకులు సమిధలు కావలసిందేనా? యుద్ధాల వల్ల విధ్వంసమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఒనగూరదు. ఇకనైనా పశ్చిమాసియాలో మారణ హోమానికి స్వస్తి పలకాలి. ప్రజాస్వామ్య పద్దతిలో ఇరాన్‌లో ఎన్నికలు జరి పి, ఎలాంటి మతపరమైన నిర్భంధాలు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కు ను కల్పించాలి. ఇరాన్ విధ్వంసం నేర్పిన పాఠాలు ప్రపంచంలోని నియంతృత్వ దేశాలకు గుణపాఠం కావాలి.

సుంకవల్లి సత్తిరాజు