7 March, 2026 | 2:41 PM

సౌతాఫ్రికా ఏ సంచలన విజయం

10-11-2025 12:00 AM

-417 రన్స్ టార్గెట్ ఛేదించిన సఫారీలు

-తేలిపోయిన భారత్ ఏ బౌలర్లు

బెంగళూరు, నవంబర్ 9 : భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా ప్రధాన బ్యాటర్లు అదరగొట్టారు. భారత్ ఏ జట్టుతో జరిగిన రెండో అనధికార టెస్టుల తమ జట్టుకు సంచలన విజయాన్ని అందించారు. ఎవ్వరూ ఊహించని విధంగా సౌతాఫ్రికా ఏ జట్టు 417 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏ 255 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా ఏ జట్టు 221 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఏ 382/7 స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది.

దీంతో 417 పరుగుల టార్గెట్‌ను ఛేదించడం కష్టమనే అంతా అనుకున్నారు. అయితే చివరిరోజు సఫారీ బ్యాటర్లు అద్భుతం చేశారు. టాపార్డర్, మిడిలార్డర్ సమిష్టిగా రాణించి జట్టును గెలిపించారు. జోర్డన్ హెర్మన్ (91), సెనోక్వానే (77),. బవుమా (59), హంజా (77), వికెట్ కీపర్ బ్యాటర్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీల చేయడంతో సౌతాఫ్రికా భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సమం చేసింది. భారత ఏ బౌలర్లందరూ తేలిపోయారు. మహ్మద్ సిరాజ్,  ఆకాశ్ దీప్, ప్రసిద్ధ కృష్ణ నిరాశపరిచారు. కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మ్యాజిక్ చూపించలేకపోయాడు. కాగా తొలి అనధికారిక టెస్టులో భారత్ గెలిచింది.ఇరు జట్ల మధ్య అనధికారిక వన్డే సిరీస్ నవంబర్ 13 నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్‌లో భారత్ ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.