calender_icon.png 11 November, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నితీశ్ ప్లేస్‌కు జురెల్ ఎర్త్

10-11-2025 12:00:00 AM

-వరుస సెంచరీలతో అదుర్స్

-స్పెషలిస్ట్ బ్యాటర్‌గా చోటు ఖాయం

బెంగళూరు, నవంబర్ 9 : దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు రెడీ అవుతోంది. ఈ లోపే ఆ సిరీస్‌కు ఎంపికైన పలువురు యువ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటారు. సిరీస్ డ్రాగా ముగిసినప్పటకీ రెండో అనధికారిక టెస్టులో మాత్రం ధృవ్ జురెల్ అదరగొట్టాడు. ఒకటి కాదు రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు బాదేశాడు. స్టార్ బ్యాటర్లు రాహుల్, పడిక్కల్ , అభిమన్యు ఈశ్వరన్ విఫలమైన పిచ్‌పై అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడిన ఇన్నింగ్స్‌కు ఎంత విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏ కేవలం 86 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులో నిలబడి సెంచరీ బాదాడు. జట్టుకు మంచి స్కోర్ అందించడంలో జురెల్‌దే కీలకపాత్ర. ఎక్కువ సేపు తానే స్ట్రుకింగ్ తీసుకుంటూ టెయిలెంటర్లతో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ మరోసారి శతకం చేశాడు. కెప్టెన్ పంత్, హర్ష్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యాలతో భారత్ ఏ జట్టుకు భారీస్కోర్ అందించాడు.

సాధారణంగా రెడ్ బాల్ క్రికెట్‌తో ఆటగాడి నైపుణ్యం తెలుస్తుంది. జురెల్ అటు వైట్‌బాల్ ఫార్మాస్‌తో అదరగొడుతూనే రెడ్ బాల్ క్రికెట్‌లోనూ తాను ఎంత విలువైన ఆటగాడినో నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికా ఏతో రెండో అనధికారిక టెస్టులో జురెల్ తొలి ఇన్నింగ్స్‌లో 132(12 ఫోర్లు,4 సిక్స్‌లు), రెండో ఇన్నింగ్స్‌లో 127(15 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ నాటౌట్‌గా నిలిచాడు. సఫారీ పేసర్లు బౌన్సర్లతో ఇబ్బంది పెట్టినా చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

జురెల్ తన సూపర్బ్ బ్యాటింగ్‌తో ఇప్పుడు కోచ్ గంభీర్‌కు సవాల్ విసిరాడనే చెప్పాలి. ఎందుకంటే తాజా ప్రదర్శనతో తుది జట్టులో అతనికి చోటు కల్పించక తప్పని పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంతకుముందు విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ జురెల్ సెంచరీ చేశాడు. ఇప్పుడు వరుసగా రెండు శతకాలు చేసిన తర్వాత తుది జట్టులో ప్లేస్ ఇవ్వకుంటే మాత్రం గంభీర్‌పై తీవ్ర విమర్శలు రావడం ఖాయం. దేశవాళీ క్రికెట్‌లో ఫామ్ ఆధారంగానే జట్టు ఎంపిక ఉంటుందని గతంలో పలుసార్లు చెప్పిన గంభీర్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ పంత్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా జురెల్‌ను ఎంపిక చేసింది. పంత్ లేనప్పుడు మెయిన్ కీపర్‌గా కొనసాగాడు.

ఇప్పుడు పంత్ గాయం నుంచి కోలుకుని వచ్చేయడంతో తుది జట్టులో చోటు కష్టమే అనుకున్నారు. అయితే వరుసగా రెండు సెంచరీలు బాదిన జురెల్‌ను ఇప్పుడు నితీశ్ కుమార్‌రెడ్డి ప్లేస్‌లో తీసుకునే అవకాశముంది. కీపింగ్ బాధ్యతలు కాకుండా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. నిజానికి భారత టెస్ట్ జట్టులో నితీశ్ రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్నాడు. అయితే సౌతాఫ్రికాతో సిరీస్ సొంతగడ్డపై జరుగుతుండడం, స్పిన్ పిచ్‌లపై నితీశ్ లాంటి మీడియం పేస్ ఆల్‌రౌండర్ అవసరం లేకపోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీంతో జట్టులో మరొకరి ప్లేస్‌లో జురెల్‌ను భర్తీ చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తన సూపర్ ఫామ్‌తో జురెల్ నితీశ్ కుమార్‌రెడ్డి ప్లేస్‌కు ఎర్త్ పెట్టినట్టు చెప్పొచ్చు. ఇప్పటి వరకూ 7 టెస్టులు ఆడిన జురెల్ 47.78 సగటుతో 430 పరుగులు చేయగా.. దీనిలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.