1 September, 2026 | 2:01 AM

మాకు శక్తినిచ్చేది ప్రేక్షకుల ప్రశంసలే!

01-09-2026 01:26 AM

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ 

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కూర్మ అవతార్’. ఈ సినిమాను హర్షవర్ధన్ కడియాల దర్శకత్వంలో పంచవక్త్ర పిక్చర్స్, రుక్వీణ స్టూడియోస్ బ్యానర్లపై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. ఇందులో రాజ్‌తరుణ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సాయికుమార్, శివాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ సోమవారం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “టీజర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఈ సినిమా ‘నరసింహ అవతార్’, ‘ఇరుముడి’ సినిమాల్లాగే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా” అన్నారు. శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “కూర్మ అవతార్’లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. నేనెప్పుడూ కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అని చూడను. కథ నచ్చితే సినిమా చేస్తా. దర్శకుడిని నమ్ముతా. హర్ష అద్భుతమైన విజన్‌తో ఈ సినిమా తీశారు. ప్రేక్షకుల ప్రశంసలే మాకు గొప్ప శక్తినిస్తాయి” అని తెలిపారు.

డైరెక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ.. “ఇది చాలా పెద్ద జర్నీ. రాజ్‌తరుణ్, శివన్న, సాయికుమార్.. ఇలా అందరూ దేవుళ్లలా నాకు తోడుగా నిలిచారు. నేను తొలి సినిమా చేస్తున్న దర్శకుడిని. కథ చెప్పగానే ఆ పాత్రను అంగీకరించిన శివన్నకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా” అని చెప్పారు.

నిర్మాత నరేంద్ర మాట్లాడుతూ.. “విష్ణుమూర్తి రెండో అవతారం కథతో ఈ సినిమా తీయడం అదృష్టంగా భావిస్తున్నా. నా తొలి సినిమాలోనే వెటరన్ యాక్టర్స్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా” అన్నారు. ‘మేము ఎంత కష్టపడ్డామో అదంతా ప్రేక్షకులకు సినిమాలో కనిపిస్తుంద’ని నిర్మాత పూజిత చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రాజ్‌తరుణ్, నటుడు సాయికుమార్, నటి వరలక్ష్మి శరత్‌కుమార్, సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ కూడా మాట్లాడారు.