12 August, 2026 | 3:51 PM

420 హామీలు ఏమయ్యాయి?

28-01-2025 12:00 AM
  1. జనవరి 30న గాంధీ విగ్రహాలకు వినతులిస్తాం
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అబద్ధాలతో పాలన కొనసాగిస్తున్న వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని జనవరి 30న మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు ఇద్దామని బీఆర్‌ఎస్వీ నేతలకు, విద్యార్థులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ భవన్‌లో సోమవారం బీఆర్‌ఎస్వీ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. జనవరి 30న గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టేలా ఒరిజినల్ గాంధీ  ఈ డూప్లికేట్ గాంధీలకు బుద్ధినిచ్చేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ‘జనవరి 30 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతుంది.

కాబట్టి 420 హామీలపై ప్రశ్నిద్దాం. గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి వినతి పత్రమిస్తూ.. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు రేవంత్‌రెడ్డి కలలోకి వచ్చి మంచి బుద్ధి చెప్పేట్టు ఆదేశాలు ఇవ్వండంటూ వినతిపత్రం ఇద్దాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్వీ శ్రేణులకు పిలుపునిచ్చారు.