కట్టెల పొయ్యి, బోరు నీళ్లు వాడొద్దు
- మిషన్ భగీరథ నీళ్లనే వినియోగించాలి
- అన్ని హాస్టళ్లలో కామన్ మెనూ ఉండాలి
- మధ్యాహ్న భోజనంపై సీఎస్‌కు తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక
హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): గత కొంతకాలంగా రాష్ట్రంలోని సర్కార్ విద్యాసంస్థలు, గురుకుల హాస్టళ్లలో జరుగుతున్న మిడ్ డే మీల్స్ ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పించింది. హాస్టళ్లు, గురుకులాలు సహా మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిల మీద వండొద్దని, గ్యాస్ పొయ్యిల మీదే వంట చేయాలని సూచించింది.
ఇందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. వంట సహా తాగేందుకు బోర్‌నీళ్లు వాడొద్దని, మిషన్ భగీరథ నల్లా నీటినే వినియోగించాలని సూచించింది. ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టళ్లలన్నింటికీ కామన్ మెనూ అమలుచేయాలని నివేదికలో ప్రతిపాదించింది. మెస్‌చార్జీలను అన్ని కేటగిరీల వారికి రెండు రూపాయాలు పెంచాలని సూచించింది.
అంగన్‌వాడీలు, గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, జిల్లా పరిషత్ పాఠశాలన్న వ్యత్యాసం లేకుండా అన్నింటికి ఒకే తరహాలో ఒకే మెస్‌చార్జీలను అమలు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. వీటికి సంబంధించి 50 పేజీల నివేదికను సమర్పించారు.
ఆందోళనకర పరిస్థితులు...
రాష్ట్రంలోని గురుకులాలు, వసతిగృహాలు, సర్కారు బడుల్లో ఆందోళనకర పరిస్థితులున్నాయి. ఇటీవల నారాయణ్‌పేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో వరుసగా మూడు రోజులు ఫుడ్‌పాయిజన్ ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 350 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
వివిధ చోట్ల రాష్ట్రవ్యాప్తంగా ఏడాది కాలంలో 45 మందికి పైగా విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో పరిస్థితుల రాష్ట్రప్రభుత్వం విద్యా కమిషన్ ద్వారా పరిస్థితులను అధ్యయనం చేయించింది. విద్యాకమిషన్ మధ్యాహ్న భోజనం సహా గురుకులాల్లో ఆహారభద్రత, నాణ్యతలను పరిశీలించింది.
పారిశుధ్య నిర్వహణలో లోపాలు ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్న భోజనం పథకం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆహార నాణ్యత, భద్రతపై సిఫారసులు శీర్షికతో 50 పేజీల నివేదికను రూపొంచింది. ఆ నివేదికను సోమవారం సీఎస్ శాంతికుమారికి కమిషనర్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారికొండ వెంకటేశ్, జోత్స్న శివారెడ్డి సమర్పించారు.
కమిషన్ సిఫార్సులు..
* సన్నబియ్యం, పరిశుభ్రమైన కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలి.
* విద్యాసంస్థలన్నింటికి కామన్ మెనూ అమలుచేయాలి. సెంట్రలైజ్డ్ టెండర్ల ద్వారా సామాగ్రి సరఫరా చేయాలి.
* రవ్వ, బియ్యం, పప్పులు, నూనె, వంట సామాగ్రిని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఈఐబ్యూడీసీ) ద్వారా సరఫరా చేయాలి.
* మధ్యాహ్న భోజన వర్కర్లు, కుక్ కమ్ హెల్పర్లు వేతనాలు, పారితోషికాన్ని పెంచాలి.
* చెల్లింపులు త్వరగా చేయాలి. బిల్లులను 15 రోజుల్లో క్లియర్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ బిల్లులను రూపొందించడం సమస్యగా మారింది. సెంట్రలైల్డ్ బిల్లింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలి.
* ఇంటర్మీడియెట్‌లో సర్కార్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూర్చాలి.
* సరుకుల స్టోరేజీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటిలేషన్‌తో పాటు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి.
* టాయిలెట్స్ సహా కిచెన్, డైనింగ్‌హాల్స్‌ను ఎప్పటికిప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.
* 500 మంది విద్యార్థులకు వెయ్యి చదరపు ఫీట్ల విస్తీర్ణంలో డైనింగ్ హాల్‌ను నిర్మించాలి. విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్, డైనింగ్ టేబుళ్లు అందుబాటులో ఉంచాలి.
* నీటి కాలుష్యం ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తోంది. తాగేందుకు, వంటకు బోర్‌నీళ్లు వాడొద్దు. మిషన్ భగీరథ నల్లా నీటినే వాడాలి
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)తో ఫుడ్ శాంపిల్ పరీక్షలు, నీటి నాణ్యతా పరీక్షలను తరుచూ నిర్వహించాలి.
* 1 నుంచి -5 తరగతులు, 6-, 8 తరగతులు, 9, 10 తరగతుల్లోని విద్యార్థులకు వేర్వేరు పరిమాణంలో భోజనం అందించాలి.
* పాములు, విష పురుగులు తిరగకుండా విద్యాసంస్థలన్నింటకీ ప్రహరీగోడలు నిర్మించాలి.






