10 May, 2026 | 4:46 PM

అనుమతుల జాప్యంతో తీరని నష్టం

28-01-2025 12:00 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ 

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో జాప్యం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని బీఆర్‌ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏపీ చేపట్టిన గోదావరి -  బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడంతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు.

ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు సోమవారం లేఖరాశారు. ‘విభజన చట్టం ప్రకారం గోదావరి- -కృష్ణా బోర్డుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉన్నా.. ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌ను చేపట్టడం చట్టాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టుకు నిధుల మంజూరు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రెండు లేఖలు రాయడం ఆందోళనకరం.

కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉండటం శోచనీయం. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి రావడానికి కేంద్రం జాప్యం చేస్తోంది. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గఢ్ ఎన్‌ఓసీ జారీపై కేంద్రం జోక్యం అవసరం. పాలమూరు- -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై కేంద్రం దృష్టి సారించాల్సి ఉంది.

తెలంగాణ ప్రభుత్వం పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. వరదజలాల వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అదనపు ఒక టీఎంసీ నీరు ఎత్తిపోసే ప్రణాళికకు అనుమతులు లభించలేదు.

గోదావరి జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. అనుమతుల సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం  విఫలమవడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోంద ని, రాష్ట్ర ప్రయోజనాల కోసం చొరవ తీసుకోవాలి’ అని కిషన్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.