6 March, 2026 | 3:50 AM

ఈ లూటిఫికేషన్ ఏంది?

06-03-2026 01:52 AM
  1. మూసీ కోసం ఒక్క ఇల్లు కూల్చనిది బీఆర్‌ఎస్ మోడల్
  2. లక్షన్నర ఇండ్లు కూల్చే బుల్డోజర్ మోడల్ కాంగ్రెస్‌ది 

విధ్వంసం లేకుండానే మూసీ అభివృద్ధి

రూ. 16 వేల కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి

లక్షన్నర పేదల ఇండ్లు కూల్చి మూసీ అభివృద్ధి చేస్తామంటే ఒప్పుకోం

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి) : విధ్వం సం, అరాచకం లేకుండా మూసీని అభివృద్ధి చేయవ చ్చు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పా రు. మూసీ అభివృద్ధి అంశంలో ఒక్క ఇల్లు కూల్చే అవసరం లేనిది బీఆర్‌ఎస్ మోడల్ అయితే, లక్షన్నర ఇండ్లను కూల్చే బుల్డోజర్ మోడల్ కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ మోడల్‌లో వికాసం ఉంటే కాంగ్రెస్ విధానాల్లో విధ్వంసం ఉన్నదని విమర్శించారు.

మూసీ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ చేస్తున్న అరాచకాన్ని అవినీతిని ఆపాలని, తమ అవినీతి సొమ్ముల కోసం లక్షల మంది పేదల ఇండ్లు పూలగొట్టే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. గురువారం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ వాణిదేవిలతో కలిసి నాగోల్‌లో ఉన్న ఎస్టీపీని సందర్శించి తర్వాత నాగోల్ బ్రిడ్జి వద్ద గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసీ మోడల్‌ని పరిశీలించి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ మోడల్ పరిపాలన ఆపాలని కేటీఆర్ హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లోని కోస్గిలో స్వయంగా కట్టుకు న్న ఇల్లు రెడ్డికుంట చెరువులో ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉంటదని.. కానీ దాన్ని ఎవరూ ముట్టుకోరని మండిపడ్డారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ ఇండ్లు బఫర్ జోన్‌లో ఉంటాయని, కేవీపీ రామచందర్‌రావు ఇల్లు, కాంగ్రెస్ చీఫ్ విప్ పద్మా మహేందర్‌రెడ్డి ఇల్లు హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉన్నా ప్రభుత్వానికి మాత్రం కనబడవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీటిని ముట్టడానికి అధికారులకు ధైర్యం లేదు.. హైడ్రాకు కళ్లు కనబడ టం లేదని, కానీ గరీబ్‌లు, పేదవాళ్లకు అనుమతులు న్నా కూలగొడుతున్నారని విమర్శించారు. సందర్భం వచ్చినప్పుడు రాహుల్ గాంధీని, రేవంత్‌రెడ్డిని కుర్చీ మడతపెట్టి ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. 

రూ. 4 వేల కోట్లతో గత ప్రభుత్వంలోనే నగర వ్యాప్తంగా 32 ఎస్టీపీలు 85 శాతం వరకు నిర్మాణలు కూడా పూర్తి అయ్యాయని, కొన్ని చోట్ల ప్రారంభం కూడా చేశామని తెలిపారు. మూసీలోకి వచ్చే ప్రతి చుక్కా శుద్ధి చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ముందడుగు వేసిందని గుర్తు చేశారు. అందులో భాగంగానే కేవలం రూ. 1100 కోట్ల ఖర్చుతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను గండిపేట చెరువులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించి కేబినెట్‌లో ఆమోదించినట్టు చెప్పారు.

కేవలం రూ. 6 కోట్లతో ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ చేసి చూపించామని పేర్కొన్నారు. కేవలం తన అవినీతి కోసం, ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల సంపాదన కోసం లక్షన్నర మంది పేదల ఇళ్లను కూలగొడతామంటే ఊరుకోమని, హైదరాబాద్‌లోని ప్రతి ఒక్క బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, కేసీఆర్ సైనికుడు కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతారని కేటీఆర్ తెలిపారు.  

బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్..

కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట హైదరాబాద్ నగరంలో సృష్టిస్తున్న విధ్వంసాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది ’మూసీ బ్యూటిఫికేషన్’ కాదు అని, అది ’లూటిఫికేషన్’ అని ఆరోపించారు.  రూ. 16వేల కోట్లతో మొత్తం మురు గు నీటిని శుద్ధి చేయడంతో పాటు కొండపోచమ్మ నుంచి మంచి నీళ్లను మూసీ లోకి తీసుకురావడం,

రెండు వైపులా స్కైవేల నిర్మాణం వంటి అన్ని కార్యక్రమాలతో కూడిన సమగ్రమైన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నదని, కానీ కేవలం వేల కోట్ల రూపాయల అవినీతి కోసం రేవంత్ రెడ్డి ఈ మూసీ ప్రాజెక్టును ఎత్తుకున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఒక్క ఇల్లు కట్టినట్టు చూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. 

మీకు చేతగాకపోతే.. 

ఎన్నికల ముందు పేదలకు అండగా ఉంటామని, వారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు తమ ఇళ్లను కూలగొడుతుందో ప్రభుత్వం అని ప్రజలు భయం భయంగా బతుకుతున్నారని కేటీఆర్ అన్నారు.

’ఇందిరమ్మ రాజ్యం’ తెస్తామని చెప్పి ’బుల్డోజర్ రాజ్యాన్ని’ తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు.  సుందరీకరణ పేరిట వేలాది ఇళ్లు కూలగొడతామంటే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, కచ్చితంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.  మూసీ సుందరీకరణ చేతగాకపోతే మాకు అప్పచెప్పాలని, కేవలం రూ. 16 వేల కోట్లతో రెండేళ్లలో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేసి చూపిస్తామని సవాల్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పేద ప్రజల ఇళ్లకు నష్టం జరగకుండా మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.