calender_icon.png 14 January, 2026 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవుల్లో లేని మమ్మల్ని సస్పెండ్ చేయడం ఏంటి?

14-01-2026 02:06:14 AM

మాజీ వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి

మేము గ్రామస్థాయి కార్యకర్తలమే.. మండల స్థాయి నేతలం కాదు..

పార్టీ వ్యతిరేక పనులకు పాల్పడలేదు.. కేవలం ఆవేదన వ్యక్తం చేశాం

కందుకూరు, జనవరి 13 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీలో తమకు ఎలాంటి అధికారిక పదవులు లేవని, తాము కేవలం గ్రామస్థాయి నాయకులం మాత్రమేనని మాజీ వైస్ ఎంపీపీ శమంతా మరియు ప్రభాకర్ రెడ్డి లు స్పష్టం చేశారు. ఇటీవల ‘విజయక్రాంతి‘ పత్రికలో ప్రచురితమైన ’కందుకూరు కాంగ్రెస్లో ముదిరిన గ్రూపు రాజకీయం’ అనే కథనంపై వారు స్పందిస్తూ తమ వివరణను ఇచ్చారు.

మేము ఎవరి పైన దాడి చేయలేదు.. మా గోడు చెప్పుకున్నాం..

ఇటీవల పార్టీ సమావేశంలో జరిగిన పరిణామాలపై వారు మాట్లాడుతూ.. తాము ఎవరిపైనా దాడి చేయలేదని, కేవలం పార్టీ కోసం తాము పడుతున్న ఇబ్బందులను, బాధలను మాత్రమే నాయకుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లాగే వ్యవహరించామని వారు పేర్కొన్నారు.

సస్పెన్షన్ వార్తలపై ఆవేదన..

తమను పార్టీ బాధ్యతల నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ నియోజకవర్గ ఇంచార్జి కె ఎల్ ఆర్ టీపీసీసీకి లేఖలు రాయడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పార్టీలో ఎలాంటి పదవుల్లో లేని తమను, బాధ్యతల నుండి తొలగించడం అనే ప్రసక్తే ఉండదని వారు గుర్తు చేశారు. గత ఏడేళ్లుగా పార్టీ పటిష్టత కోసం అంకితభావంతో పని చేశామని, రెండు పర్యాయాలు సర్పంచిగా పోటీ చేసి ఓడిపోయినా పార్టీని వీడలేదని వారు వివరించారు. గ్రూపు రాజకీయాల పేరుతో తమపై బురద చల్లడం సరికాదని, జిల్లా స్థాయి నాయకులు క్షేత్రస్థాయిలో వాస్తవాలను విచారించి నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారు. తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఇప్పటికైనా సరైన నిజాలను గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.