తాహాసిల్దార్ కోసం తప్పని ఎదురుచూపులు..!
- ఒంటిగంట వరకు కాళీ కుర్చీలే దర్శనం.
- అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు.
- పట్టించుకోని అధికారులు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మండల తాహాసిల్దార్(Nagarkurnool Mandal Tehsildar) కార్యాలయంలో అధికారి కోసం సామాన్యులు నిత్యం ఎదురుచూపులు తప్పడం లేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి హాజరు కావలసిన తాసిల్దార్ మధ్యాహ్నం 1:00 వరకు హాజరు కాకపోవడంతో వారితో సహా ఏ ఒక్క అధికారి కూడా సక్రమంగా హాజరు కావడం లేదని రైతులు మండిపడుతున్నారు.
కుల ఆదాయ ధ్రువపత్రాలతో పాటు రేషన్ కార్డ్ వంటి వాటికోసం కార్యాలయాల చుట్టూ నిత్యం తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు క్రయ విక్రయదారులు కూడా స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ ఆలస్యంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని కూడా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మంగళవారం మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి సైతం విధులకు హాజరు కాకపోవడంతో అప్పటి వరకు తాసిల్దార్ ఇతర అధికారుల కోసం సామాన్యులు ఎదురు చూడక తప్పలేదు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.




