ప్రైవేట్ వ్యక్తుల గుప్పిట్లో బందీగా రిక్వెస్ట్ బస్ స్టాప్.!
పట్టించుకోని ఆర్టీసీ అధికారులు.
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల కొరకు స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్మించిన రిక్వెస్ట్ బస్ స్టాప్(Request Bus Stop) ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు వీధి వ్యాపారస్తుల చేతిలో బందీగా మారింది. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో నిర్మించిన రిక్వెస్ట్ బస్ స్టాప్ ప్రైవేటు వ్యక్తుల ప్రచార ప్రకటన కోసం పరిమితం కాగా జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన రిక్వెస్ట్ బస్ స్టాప్ చుట్టూరా ప్రైవేట్ వ్యక్తులు తమ చిరు వ్యాపారుల కోసం షెల్టర్స్ ఏర్పాటు చేసుకున్నారు.
మరికొంతమంది వ్యాపారులు చిరు వ్యాపారుల పేరుతో అద్దె ప్రాతిపదికన కబ్జా చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయా రాజకీయ పార్టీ నేతలు ప్రచార ఫ్లెక్సీలు సైతం ప్రయాణికుల కొరకు అనుకూలంగా ఉన్న రిక్వెస్ట్ బస్ స్టాప్ కమ్మేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయడం విస్మయానికి గురిచేస్తుంది. అయినా ఇలాంటి బస్టాప్ లను కాపాడాల్సిన ఆర్టిసి అధికారులు అంటి ముట్టనట్లు వ్యవహరించడంతో కబ్జాకు గురవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా వాటిని కబ్జా నుంచి కాపాడాలని స్థానికులు ప్రయాణికులు కోరుతున్నారు.




