24 August, 2026 | 10:20 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు

24-06-2025 01:08 AM
  1. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈసీని ప్రశ్నించిన హైకోర్టు
  2. --  30 రోజుల గడువు కోరిన ప్రభుత్వం
  3. రెండు నెలల సమయం కావాలన్న ఎన్నికల సంఘం 
  4. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

హైదరాబాద్, జూన్ 23 : సర్పంచ్ ఎన్నికలను ఎన్ని రోజుల్లో నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇంకా ఎందుకు నిర్వహించలేదని నిలదీసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నల్లగొండ జిల్లా మాజీ సర్పంచ్‌లతో పాటు దాఖలైన మొత్తం ఆరు పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది.

2024 ఫిబ్రవరి 1వ తేదీతో రాష్ట్రంలో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిపోగా, ఎంపీటీసీల పదవీ కాలం 2024 జూలై 5తో పూర్తయిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆరునెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని పిటిషన్లు దాఖలు అయ్యాయి.

వీటిపై ఇదివరకు వాదనలు జరిగాయి. తాజాగా సోమవారం మరోసారి పిటిషన్లు విచారణకు రాగా పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం వాదనలు పూర్తికావడంతో స్థానిక సంస్థలపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

రెండు నెలల సమయం కావాలి..

విచారణ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజులు, ఎన్నికల సంఘం 60 రోజుల పాటు గడువు కావాలని హైకోర్టును కోరాయి. రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ పూర్తికావడానికి ప్రభుత్వం గడువు కోరగా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే ఎన్నికలు నిర్వహించేందుకు తమకు రెండు నెలలపాటు సమయం కావాలని ఎన్నికల సంఘం న్యాయస్థానానికి తెలిపింది.

అయితే గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎన్నికల నిర్వహణ విషయంలో గత విచారణలో చెప్పినట్టుగా ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఆగస్టు తర్వాతే అవకాశం?

 రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ నడుస్తోంది. పలువురు మంత్రులు ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఆసక్తితో తమ ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించారు. ఇదిలా ఉండగా కులగణన, బీసీల రిజర్వేషన్ అంశం సైతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో రిజర్వ్ చేసిన తీర్పులో ఏముంది? ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ కానున్నాయనే విషయంపై సస్పెన్స్ నెలకొంది. ప్రభుత్వం ఈసీ వాదనలను పరిగణలోకి తీసుకుంటే ఆగస్టు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి.