సర్పంచే సేవకురాలైన వేళ
ఆదర్శంగా నిలిచిన మర్రి సంధ్య, సేవే సింహాసనం& ప్రజలే బలం
అశ్వాపురం, మార్చి 25 (విజయక్రాంతి): అధికార పదవి అంటే అధికార ప్రదర్శన కాదు, ప్రజాసేవకే అన్న భావనను ఆచరణలో చూపిస్తూ అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ సర్పంచ్ మర్రి సంధ్య అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎన్నికల సమయంలో సర్పంచ్గా కాదు, మీ సేవకురాలిగా ఉంటాను అని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, బుధవారం గ్రామపంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులతో కలిసి స్వయంగా చేతులు కలిపి మణుగూరు కొత్తగూడెం రహదారి పక్కన ఉన్న బీజీ కొత్తూరు బస్ షెల్టర్ పరిసరాలను శుభ్రం చేసి, పిచ్చి మొక్కలను తొలగించి, షెల్టర్ను నీటితో కడగడం ద్వారా సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ నెల 27న భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలనే సంకల్పంతో మెయిన్ రోడ్డు ఇరువైపులా చెత్త, మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిన ఆమె, సాధారణ కార్మికురాలిలా పనిచేయడం చూసిన గ్రామస్తులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
గ్రామం శుభ్రంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి అన్న లక్ష్యంతో తాను కూడా సిబ్బందితో పాటు పనిచేయాలని నిర్ణయించుకున్నానని, ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని సంధ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో ముత్యాలరావు, వార్డు సభ్యులు ఆకిటి సిద్ధార్థ రెడ్డి, కొల్లు మంగమ్మ, సిబ్బంది శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు, సౌందర్య, ఉప్పల్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవ అంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి అనే సందేశాన్ని ఈ ఘటన మరింత బలంగా వినిపిస్తోంది.




