నకిలీ పత్రాలతో భూములు కబ్జా
- ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
- నిందితుల్లో ఓ పోలీస్ అధికారి
మేడ్చల్, మార్చి 25 (విజయక్రాంతి): అమాయకుల భూములపై కన్నేసి, నకిలీ పత్రాలతో కబ్జాకు పాల్పడుతున్న ముఠాలను కీసర పోలీసులు బుధవారం పట్టుకున్నారు. నిందితుల్లో ఏఎస్సై స్థాయి పోలీసు అధికారి కూడా ఉండటం గమనార్హం. మర ణ ధృవీకరణ పత్రాల నుంచి కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ల వరకు అన్నింటినీ ఫోర్జరీ చేస్తూ, యజమానులకు తెలియకుండానే ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తున్న ఇద్దరు ప్రధాన నిందితులతో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
వీరు ప్రధానంగా ఖాళీగా ఉన్న ప్లాట్లను, యజమానులు అందుబాటులో లేని భూములను లక్ష్యంగా చేసుకుం టున్నారు. మొదట అసలు యజమానుల వివరాలు సేకరించి, వారు చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టిస్తారు. ఆపై నకిలీ వారసులను పుట్టించి, గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్లు, సేల్ డీడ్ల ద్వారా భూములను తమ అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తారు. డిసిపి సిహెచ్ శ్రీధర్ బుధవారం వివరాలు వెల్లడించారు.
ఈ నెల 16, 17 తేదీల్లో కేశబోయిన రమాదేవి, మదాను మాధురి అనే మహిళలు తమ భూములను ఎవరో గుర్తు తెలి యని వ్యక్తులు ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు బదలాయించారని కీసర పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. రెండు వేర్వేరు కేసుల్లో నిందితులను గుర్తించారు.
మొదటి కేసులో కనకాటి లింగయ్య గౌడ్ (ఏఎస్సై), ప్రవీణ్‌రెడ్డి, మోడెమ్ సంప త్, కాంబ్లే దీపలను అరెస్ట్ చేయగా.. రెండో కేసులో ఉప్పల వేణు, దొనపాటి వెంకట్‌రెడ్డి, గుండిగ జ్యోతి, మదాను ఇన్నయ్యలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఫోర్జరీ చేసిన పత్రాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ‘భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలి‘ అని మల్కాజిగిరి డిసిపి శ్రీధర్ సూచించారు.




