15 June, 2026 | 2:03 AM

నాగర్‌కుంట ‘పంచాయతీ’కి మోక్షమెప్పుడో?

15-06-2026 12:47 AM

రూఫ్ పెచ్చులు ఊడుతున్నా పట్టించుకోని అధికారులు

షాబాద్, జూన్ 14(విజయక్రాంతి): మండల పరిధిలోని నాగర్కుంట గ్రామపంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరి అత్యంత ప్రమాదకరంగా మారింది. గోడలు పగుళ్లు ఇచ్చి, పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అటు విధుల్లో ఉన్న సిబ్బంది, ఇటు పనుల కోసం వచ్చే ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భవనం మరింత బలహీనపడటం స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

వినతులు బుట్ట దాఖలు..

షాబాద్ మండలంలోని నాగర్కుంట గ్రామపంచాయతీ కార్యాలయం దుస్థితి స్థానిక గ్రామాభివృద్ధికి అద్దం పడుతోంది. నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఈ కార్యాలయానికి వస్తుంటారు. అయితే, భవనం పూర్తిగా శిథిలమవ్వడం, వర్షం వస్తే పైకప్పు నుంచి నీరు కారుతుండటంతో రికార్డులు సైతం పాడయ్యే పరిస్థితి నెలకొంది. కార్యాలయానికి రావాలంటేనే ప్రజలు, విధులకు హాజరవ్వాలంటే సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఈ సమస్యపై గ్రామస్థులు పలుమార్లు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఇప్పటివరకు ఎలాం టి శాశ్వత పరిష్కారం లభించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే స్పందించి తక్షణమే కొత్త భవ నాన్ని నిర్మించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ విషయమై గ్రామ సర్పంచ్ పాలమాకుల మల్లయ్య ఉన్నతాధికారులను సంప్రదించగా.. నూతన గ్రామ పంచాయతీ భవన మంజూరుకు వారు సా నుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇ కనైనా పాలకులు, అధికారులు క్షేత్రస్థాయి లో స్పందించి యుద్ధప్రాతిపదికన నూతన భవ న నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.