క్రీడా ప్రాంగణం పూర్తయ్యేదెన్నడు?
మేడ్చల్, జూన్ 18 (విజయక్రాంతి): పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ సమీపంలోని మహాత్మ జ్యోతిరావుపూలే క్రికెట్ స్టేడియమే ఇందుకు ఉదాహరణ. 2006లో రూ.3 కోట్ల నిధులతో ఇక్కడ పనులు ప్రారంభించినప్పటికీ.. కాలక్రమేణా నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడంతో పనులను గాలికొదిలేశారు. 18 సంవత్సరాలు దాటినా స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అధ్దం పడుతోంది.
ఓ ప్రైవేట్ వ్యక్తి వ్యాపారం
గండిమైసమ్మ క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రైవేటు వ్యక్తుల కన్ను పడింది. కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేట్ వ్యక్తి అధికారులను మచ్చిక చేసుకుని స్టేడియంను తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు సమాచారం. స్టేడియంలో క్రికెట్ ఆడేందుకు వచ్చే యువకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
త్వరలోనే స్టేడియంను పరిశీలిస్తాం
ఈ విషయంపై మేడ్చల్‌ెేమల్కాజ్‌గిరి జిల్లా క్రీడాశాఖాధికారి గోపాల్‌రావును వివరణ కోరగా... తాను ఇటీవలే ఇక్కడికి వచ్చానన్నారు. త్వరలోనే స్టేడియాన్ని సందర్శించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి ప్రమేయం ఉండదని, అలాంటిదేమైనా ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తొందరగా పూర్తి చేయాలి
మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచనలకు అనుగుణంగా యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పూనుకున్నాం. అయితే, ఈ స్టేడియం నిర్మాణం పూర్తి చేయకపోవడం స్థానిక యువతకు శాపంగా మారింది. స్టేడియం పనులను పూర్తి చేసి ప్రభుత్వమే శిక్షణనిస్తే ఎంతో మంది క్రీడల్లో రాణిస్తారు. ప్రభుత్వం పట్టించుకుని పనులను పూర్తి చేయాలని కోరుతున్నాం.
చినంగి వెంకటేశం ముదిరాజ్,
మాజీ ఎంపీపీ కుత్బుల్లాపూర్ మండలం






