2 September, 2026 | 4:49 PM

అడవి నరికేస్తుంటే.. అధికారులెక్కడ..?

02-09-2026 | 04:11pm

కృష్ణసాగర్‌ బీట్‌లో రెండు హెక్టార్లలో పోడు

రహదారికి 150 మీటర్ల దూరంలోనే.. పర్యవేక్షణపై అనుమానాలు

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం రేంజి కృష్ణసాగర్‌ బీట్‌లో పోడు నరికివేత కలకలం రేపుతోంది. బీట్‌ పరిధిలో సుమారు రెండు హెక్టార్ల విస్తీర్ణంలో గుర్తుతెలియని వ్యక్తులు చెట్లను తొలగించినట్లు స్థానికులు చెబుతున్నారు.మణుగూరు క్రాస్‌రోడ్డు నుంచి అశ్వాపురం వెళ్లే ప్రధాన రహదారికి కేవలం 150 మీటర్ల దూరంలోనే ఈ ప్రాంతం ఉండటం గమనార్హం. 

సిబ్బంది పర్యవేక్షణ ఏది..?

ప్రధాన రహదారికి ఇంత సమీపంలో పెద్ద విస్తీర్ణంలో చెట్లను తొలగించినా అటవీ సిబ్బంది గుర్తించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకాలం క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఎలా సాగిందన్నది చర్చనీయాంశంగా మారింది. ఘటన వెనుక ఎవరున్నారు? నిబంధనలకు విరుద్ధంగా చెట్ల తొలగింపునకు అవకాశం ఎలా ఏర్పడిందన్న అంశాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

విచారణకు డిమాండ్‌

పచ్చదనం పెంపు, అటవీ సంరక్షణకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై వృక్ష ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులు కృష్ణసాగర్‌ బీట్‌ను పరిశీలించి, ఘటనకు బాధ్యులను గుర్తించడంతోపాటు సిబ్బంది పర్యవేక్షణపైనా విచారణ జరపాలని వారు కోరుతున్నారు.