calender_icon.png 8 June, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి కొనుగోలులో ఏది బెటర్?

04-08-2024 01:01:38 AM

నిర్మాణంలో ఉన్నదా? పూర్తయిందా?

ఇల్లు కొనేవారికి రియల్ నిపుణుల సూచనలు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 3 (విజయక్రాంతి): సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ బడ్జెట్‌లో రావడంతోపాటు అభిరుచికి తగినట్టుగా ఇల్లు ఉండాలనుకుంటారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న ధరలో, నచ్చిన ప్రాంతంలో ఇంటిని సొంతం చేసుకోవాలి అనుకుంటారు. అయితే నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలా? లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనాలా? అని చాలా మంది సందిగ్ధంలో ఉంటారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఏది అనుకూలం అన్నది మెజార్టీ కొనుగోలుదారుల ప్రశ్న. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిర్మాణ రంగం మంచి జోరుమీద ఉంది. వినియోగదారులు తమకు నచ్చిన ఇంటిని, నచ్చినవిధంగా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఇంటిని కొనడం వల్ల కొన్ని ప్రయోజనాలను పొందవచ్చని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ సమయంలో ఇంటిని కొంటే నచ్చిన ఫ్లోర్, ఇష్టమైన దిక్కుకు ఉండేలా చూసుకోవచ్చు. ఇక నిర్మాణ దశలో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా ఇంటి ధర కూడా కొంత వరకు తక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. అంతేకాదు ప్రారంభ దశలో అయితే, ఇంటిని తమకు కావాల్సిన రీతిలో కట్టించుకోవచ్చు. నిర్మాణ సమయంలో మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుంది.

లాభ, నష్టాలున్నాయి..

ఇంటి నిర్మాణం ప్రారంభించిన తర్వాత అది పూర్తయ్యేసరికి కనీసం ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. దీంతో ప్రారంభించిన సమయంలో ఉన్న ధరలతో పోల్చితే రెండేళ్ల తర్వాత ఇంటి ధర సుమారు 20 నుంచి 30 శాతం పెరుగుతుంది. ఇందులో కొంత నిర్మాణ వ్యయం కూడా పెరిగినప్పటికీ మన స్థిరాస్థి విలువ కూడా పెరుగుతుంది. అయితే నిర్మాణ సమయంలో ఇంటిని కొనుగోలు చేయడం వల్ల బిల్డర్ గడువులోపు ఇంటిని పూర్తి చేస్తాడా? అనేది పెద్ద సవాల్. నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఇంటిని కొన్న వెంటనే గృహప్రవేశం చేయవచ్చు. ఇంటి కోసం ఏ మాత్రం ఎదురు చూడాల్సిన పని లేదు.

అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణం పూర్తయ్యి సిద్ధంగా ఉన్నగృహాల ధరలే తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సిమెంట్, స్టీల్ వంటి ముడిసరకుల ధరల పెరుగుదల దృష్ట్యా కొత్త ప్రాజెక్టుల్లో ఎక్కువ ధరలు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే నిర్మాణం పూర్తయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయడం వల్ల ఒకేసారి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు నిర్మాణం పూర్తయిన ఇంటిని మన అభిరుచికి తగినట్టు మార్పులు చేయాలనుకుంటే అదనంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ లాభ, నష్టాలను బేరీజు వేసుకుని, నిర్మాణ సంస్థను బట్టి నిర్మాణంలో ఉన్న ఇంటిని, లేదంటే తమ బడ్జెట్‌కు సరిపోయి, కోరుకున్న విధంగా ఉన్న నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.