మమ్మల్ని ఆపేదెవరు?
- అధికారుల జేబులు నిండగా వాహనాచోదకుల కళ్ళలో బూడిద
- పోలీస్, ఆర్టిఏ అధికారుల జాడ ఎక్కడ?
- ఓవర్ లోడుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 28,(విజయక్రాంతి): తిలా పాపం.. తలా కొద్దిగా... ఎవరికి ఇవ్వాల్సిన మామూలు వారికిస్తున్నాం.... నిబంధనలతో పనేంటి.... ఎవరు ఎక్కడ చస్తే మాకేంటి... మమ్ములను ఆపేదెవరు అన్నట్టుగా ఉంది బూడిద రవాణా కాంట్రాక్టర్ల తీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ బూడిద చెరువులో నిండుకున్న బూడిదను తొలగించాలని లక్ష్యంతో సొసైటీలకు బూడిద తరలించే కాంట్రాక్ట్ అప్పగించారు జన్కో యాజమాన్యం.
అదే సొసైటీ కాంట్రాక్టర్ల పాలిట వరం.... ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. జన్కో అధికారులు బూడెద చెరువు ఖాళీ అయితే మహాభాగ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తరలింపు అనుమతులు పొందిన సొసైటీ కాంట్రాక్టర్లలో కొందరు (ఆ నలుగురు) అధికారులను మామూళ్ల మత్తులో ముంచి, నిబంధనలను బూడిదలో తొక్కి మోతాదుకు మించి బూడిదను తరలిస్తున్నారు.
రోడ్లపైనే లారీలు..
కేటీపీఎస్ బూడిద చెరువు నుంచి బోడుదల తరలించే వాహనాలు ఇటు జాతీయ రహదారిపై, కిన్నెరసాని పర్యాటక ప్రాంతానికి వెళ్లే మార్గంపై బారులు తీరుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తలకు మించిన భారమైంది. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పైన దృష్టి సారించే నాధుడే కరువయ్యారు.
రవాణా శాఖ అధికారుల కళ్ళముందే..
రవాణా శాఖ అధికారులు అనునిత్యం రోడ్లపై నిఘవుంచి నిబంధనలకు విరుద్ధంగా మోతాదుకు మించి ఓవర్ లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలను అరికట్టాల్సి ఉంది. పోలీస్ శాఖ అనునిత్యం రోడ్ల ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప, నిబంధనలను గాలికి వదిలి మోతాదు ఒక మించి ఓవర్ లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలను కన్నెత్తి కూడా చూడకపోవడం అనేక ఆరోపణలకు దారితీస్తోంది. వాస్తవంగా పాసింగ్ ప్రకారం ఒక్కొక్క లారీ 20 నుంచి 25 టన్నుల బూడిదను మాత్రమే తరలించాల్సి ఉంది.
జాతీయ రహదారి కోసం తరలిస్తున్న ఆ నలుగురు కాంట్రాక్టర్ల వాహనాల్లో మాత్రం 35 నుంచి 40 టన్నుల వరకు ఓవర్ లోడుతో బూడిదను తరలిస్తున్నారు. ఫలితంగా ఒక్కొక్క లారీకి అధికారులకు రోజుకు 10వేల నుంచి రూ 20 వేల వరకు ముడుపులు అందుతున్నాయని బహిరంగ చర్చ పాల్వంచలో సాగుతోంది. అందుకేనేమో నివారించాల్సిన అధికారులు నిమ్మకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ద్విచక్ర వాహన చోదకుల కళ్ళల్లో బూడిద.
మోతాదుకు మించి బూడిదను లారీల్లో తరలించడం వల్ల జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన చొధకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బూడిద పైన వేసిన టార్బాల్ గాలికి చెదిరి బూడిద లేచి వెనక వస్తున్న వాహనదారులపై పడుతోంది. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పాల్వంచ నుంచి మధిర నియోజకవర్గం వరకు ప్రయాణిస్తున్న ఈ వాహనాల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికా రులు సమన్వయంతో పనిచేసి ఓవర్ లోడ్ లారీలను అరికట్టాలని, ప్రమాదాల నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.






