30 April, 2026 | 1:59 PM

కలెక్టరేట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి

29-04-2026 12:35 AM

జిల్లా కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక

నారాయణపేట. ఏప్రిల్,28 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద కొనసాగుతున్న నూతన కలెక్టరేట్ (ఐడిఓసి) భవన నిర్మాణ పనులను మే నెలాఖరు నాటికి పూర్తి చేసి జూన్ 2న ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సీ. హెచ్. ప్రియాంక ఆర్.అండ్.బీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవనంలోని కలెక్టర్ ఛాంబర్, మీటింగ్ హాల్, వివిధ సెక్షన్  గదులలో కొనసాగుతున్న పనులను చూశారు. 

మిగిలిన పనులన్నీ మే నెలాఖరు వరకు పూర్తి చేసి జూన్ 2న కొత్త కలెక్టరేట్ ను ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించగా, ఆర్ అండ్ బీ అధికారులు జూన్ 2 వరకు నిర్మాణ పనులు పూర్తి కావడం సాధ్యం కాదని, జులై నెలలో పూర్తి అవుతాయని చెప్పారు.  మ్యాన్ పవర్ పెంచుకుని ఎలాగైనా  మే నెలాఖరు వరకు పూర్తి చేసే ప్రయత్నం చేయాలని కలెక్టర్ మరోసారి అధికారులకు సూచించారు. అయితే నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి మంజూరైన నిధులు సరిపోవడం లేదని అదనంగా నిధులు కావాలని అధికారులు కలెక్టర్ ను కోరారు.

స్పందించిన కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టరేట్ భవనంలో అవసరమైన ఫర్నిచర్ టెండర్ ఎవరు తీసుకున్నారనీ, మిగతా ఫర్నిచర్ అంతా సమకూర్చాలని ఆమె ఆదేశించారు. భవన ఆవరణలో గ్రీనరీ, వాహనాల పార్కింగ్, అంతర్గత రహదారుల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్.ఈ. వెంకట రమణ, డీ.ఈ. రాములు, ఏ ఈ లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.