calender_icon.png 1 November, 2024 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరికి మొగ్గు!

29-04-2024 12:40:53 AM

‘అసెంబ్లీ’ ఫలితాలు ప్రతిఫలిస్తాయా?

5 నెలల్లోనే ఓటర్ల అభిప్రాయం మారుతుందా?

తాజా ఎన్నికలపై పార్టీల లెక్కల పట్లు

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లపై ఆశలు

నాడు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ

లోక్‌సభలో కాంగ్రెస్‌తో పోటీకొచ్చిన బీజేపీ

బీఆర్‌ఎస్‌ది మూడోస్థానమేనని అంచనాలు

నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ పోరు 

9 స్థానాల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం

నాలుగు చోట్ల బీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఓట్లు

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల పోరు మరింత వేడెక్కింది. రాజకీయ పార్టీలు పోటాపోటీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. విజయం కోసం  వ్యూహాలను రచిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్య ర్థులు నిత్యం జనంతో మమేకం అవుతూ ఓట్లకోసం చెమటోడుస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరికి సానుకూలత ఉంటుందోనని ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 14 స్థానాల్లో విజయం సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాలవారీగా వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిం చుకొని, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ ట్రెండ్ కొనసాగుతుందా? అని కూడికలు తీసివేతలు చేసుకుంటున్నారు.

అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పరిధిలో ఖాతా తెరవలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒకటి, రెండు సీట్లు మినహా అన్నీ హస్తగతం చేసుకున్న కాంగ్రెస్.. అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మూడు నుంచి నాలుగు సీట్లవరకు కైవసం చేసుకున్నది. అయితే ఈ ట్రెండ్  పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మేరకు పని చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌తో ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తీవ్ర పోటీ నెలకొన్నదని, బీఆర్‌ఎస్ మూడో స్థానంలోకి వెళ్లిందని విశ్లేష కులు అంటున్నారు. హైదరాబాద్‌లో మజ్లిస్‌కు అవకాశం ఉంటుందని చెప్తున్నారు.  

మహబూబ్‌నగర్ 

పాలమూరు సెగ్మెంట్‌లో రెండు జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉందని చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును చూస్తే కాంగ్రెస్ ముందు వరసలో ఉంది. ఈ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌కు 6.11 లక్షలకు పైగా ఓట్లు వస్తే.. బీజేపీకి వచ్చింది కేవలం 1.13 లక్షల ఓట్లే. బీఆర్‌ఎస్‌కు 5.11 లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్‌పై బీజేపీ విజయం సాధించాలంటే బీఆర్‌ఎస్ ఓట్లను గంపగుత్తగా మళ్లించుకోవాలి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ఐదారుసార్లు అక్కడ పర్యటించారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉన్నారు. 

భువనగిరి 

భువనగిరి పరిధిలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 8.17 లక్షల ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు 5.60 లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ విజయం సాధించాలంటే లక్షల ఓటర్ల మనసు గెలుచుకోవాల్సి ఉంటుంందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. బీజేపీ బీసీ నినాదం తీసుకొచ్చినా మరో లక్ష ఓట్లకు మించి పెరిగే అవకాశం లేదని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. 

కరీంనగర్ 

రాష్ట్రంలో రసవత్తర పోరుకు అవకాశమున్న లోక్‌సభ స్థానం కరీంనగర్. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోమారు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్, బీఆర్‌ఎస్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్ పోటీ పడుతున్నారు. బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 5,12,352 లక్షల ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌కు 5,17,601 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2.50 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది బీజేపీకి సిట్టింగ్ సీటు కావడంతో ఆసక్తి నెలకొన్నది.  

నిజాబాబాద్

నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 4,08,135 ఓట్లు వస్తే.. బీజేపీకి 3.65 లక్షల ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కంటే 9 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కుమార్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ బరిలో ఉన్నారు. ధర్మపురి అర్వింద్ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవితను ఓడించారు. ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. 

ఆదిలాబాద్ 

ఆదిలాబాద్ పార్లమెంట పరిధిలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా ఓట్లు వచ్చాయి. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు 4.65 లక్షల ఓట్లు వస్తే.. బీజేపీ దాదాపు సమానంగా 4.48 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు వచ్చింది 2.52 లక్షల ఓట్లు మాత్రమే. దీంతో ఈ రెండు పార్టీలను వెనక్కి నెట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అత్రం సుగుణ, బీజేపీ నుంచి గెడం నగేష్, బీఆర్‌ఎస్ నుంచి అత్రం సక్కు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ విజయం కోసం మంత్రి సీతక్కను ఇన్‌చార్జిగా నియమించడంతో.. ఆమె అక్కడే తిష్ట వేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. 

తొమ్మిదిచోట్ల కాంగ్రెకు ఏకపక్షమే?

కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 9 నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, జహీరాబాద్, వరంగల్, పెద్దపల్లి, భువనగిరి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు లాంఛనమే అని భావిస్తున్నారు. ఆదిలాబాద్, చేవెళ్ల, మెదక్‌లో కష్టపడితే విజయం తధ్యమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే మల్కాజ్‌గిరిలో బీజేపీ మూడో స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని, సికింద్రాబాద్‌లోనూ మూడో స్థానంలో ఉన్న బీజేపీ మొదటి వరసలోకి వచ్చిందని  రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక వరంగల్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ స్థానాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు పోలైన ఓట్ల శాతం తారుమారయ్యే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

చేవెళ్ల

గ్రేటర్ హైదరాబాద్‌తో సంబంధం ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు జరుగుతుందని అంచనాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కంటే దాదాపు లక్ష ఓట్లు ఎక్కువగా వచ్చినా.. లోక్‌సభలో పోటీకి ఆ పార్టీకి బలమైన అభ్యర్థి లేరని చెప్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ రంజింత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 6.03 లక్షల ఓట్లు వస్తే.. బీజేపీకి 3.31 లక్షల ఓట్లు వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు

ఎక్కువ ఓట్లు వచ్చిన

లోక్‌సభ స్థానాలు

నియోజకవర్గం ఓట్లు

పెద్దపల్లి 3,07670

నల్లగొండ 2,87,438

భువనగిరి 2,57277

ఖమ్మం 1,69,084 

వరంగల్ 1,60258

నాగర్‌కర్నూల్ 1,05227

మహబూబ్‌నగర్ 1,00,437

జహీరాబాద్ 45,845   

బీఆర్‌ఎస్‌కు ఎక్కువ 

ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు

నియోజకవర్గం ఓట్లు

మల్కాజిగిరి 3,55,149 

మెదక్ 2,48,074

ఆదిలాబాద్ 2,13, 202

సికింద్రాబాద్ 1,83,133

చేవెళ్ల 97,909 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు పోటాపోటీగా ఓట్లు వచ్చిన స్థానాలు 

నియోజకవర్గం కాంగ్రెస్ బీఆర్‌ఎస్ 

కరీంనగర్ 5,12,352 5,17,601

నిజామాబాద్ 4,08135 4,17,045