ముంచిన మోదీ

29-04-2024 12:55:27 AM

పదేండ్లలో తెలంగాణకు తీవ్ర అన్యాయం

నీళులు, నిధులు ఇవ్వకుండా మోసం

తెలంగాణ నుంచి బీజేపీని బహిష్కరించాలి

కొంగజపం చేస్తూ వస్తున్న కేసీఆర్ 

ఆయనకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టే

ఎల్బీనగర్ ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి బీజేపీని బహిష్కరించాలని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పుట్టుకనే ప్రధాని మోదీ అవమానించారని, పదేండ్లుగా రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధుల ఇవ్వలేదని విమర్శించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు  ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని నిండా ముంచిన ప్రధాని మోదీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. ఆదివారం రాత్రి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురంలో కాంగ్రెస్ మాల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డికి మద్దతుగా సీఎం కార్నర్ మీటింగ్ నిర్వహించి ప్రసంగించారు. మల్కాజిగిరి ఓటర్ల ఆశీర్వాదంతోనే సీఎం అయ్యాయని తెలి పారు.

ప్రస్తుత మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి రాష్ట్రంలో తొమ్మిదేండ్లు మంత్రిగా పనిచేసి ఏనాడైనా ఎల్‌బీనగర్, మాల్కాజిగిరి సమస్యలను పరిష్క రించేందుకు వచ్చారా? అని ప్రశ్నించారు. 2021లో హైదరాబాద్‌లో వరద లు వచ్చి నీళ్లతో నిండిపోతే సమస్యలను కనీసం గుర్తించారా? అని నిలదీశారు. ‘వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామని చెప్పిండు కదా! బండి రాలే గుండు రాలే కానీ అరగుండు వచ్చి మిమల్ని ఓట్లు అడుగుతుండు’ అని సీఎం  చురకలంటించారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆ పార్టీవాళ్లు బహిరంగంగానే ప్రకటనలు చేస్తు న్నారని విమర్శించారు. ఇలాంటి నేతల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను అమలుచేసిన తర్వాత మోదీ తెలంగాణలో అడుగు పెట్టాలని అన్నారు. దేవుడి పేరుచెప్పి బస్టాండ్లలో బిచ్చమెత్తినట్లు.. బీజేపీ నేతలు ఇప్పుడు శ్రీరాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కొంటున్నారని విమర్శించారు. అనాది నుంచి తెలంగాణలో మత సామ రస్యం వెల్లివిరుస్తుందని, అన్ని పండుగలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొంటున్నామని, కొత్తగా బీజేపీ నేతలు చెప్పాల్సింది ఏమీ లేదని స్పష్టంచేశారు.

ఓట్ల కోసం కేసీఆర్ కొంగ జపం

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జుమ్మేరాత్ బజార్లో తూకానికి వెళ్లిందని, ఇక అది వచ్చే ముచ్చటే లేదని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ సీఎం ఉద్యోగం ఊడగొట్టినందుకే ఆయన కారును వదిలి బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. బస్సు యాత్ర పేరుతో కేసీఆర్ ఓట్ల కోసం కొంగ జపం చేస్తున్నారని, ఆ కొంగకు ఆదమరిచి ఓటు వేస్తే పరోక్షంగా బీజేపీకి లాభం జరుగుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, రూ.1,369 కోట్లను ఆర్టీసీకి ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించినట్లు చెప్పారు. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచితవైద్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రక్షాళన చేయడంతో పాటు 118 జీవో, నీటి సమస్య, ఇండ్ల పట్టాల హామీని నెరవేరుస్తామని, ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ నేతల్జు మధుయాష్కీగౌడ్, పట్నం మహేందర్‌రెడ్డి, మల్‌రెడ్డిరంగారెడ్డి, చల్లా నర్సింహ్మారెడ్డి, రాంమ్మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రోడ్‌షో సక్సెస్

 భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

ఎల్‌బీనగర్, ఏప్రిల్ 28: సీఎం రేవంత్ రోడ్ షో వనస్థలిపురంలో విజయవంతం అయింది. రోడ్ షోకు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. సీపీఐ, ఇతర ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఆదివారం సాయంత్రం వనస్థలిపురం నుంచి రైతుబజార్ వరకు రోడ్ షో నిర్వహించారు. రైతుబజార్ వద్ద సీఎం కార్నర్ మీటింగ్ నిర్వహించారు.