రియల్ ఢమాల్

29-04-2024 12:34:55 AM

ఐదు నెలల్లోనే రియల్ ఎస్టేట్ పతనం

ఆ రంగంలోని వారంతా రోడ్డుపాలు

సీఎంకు తెలంగాణ చరిత్ర తెల్వదు

ఓటుతో కాంగ్రెస్ మెడలు వంచాలి

దేశంలో బీజేపీకి 200 సీట్లు దాటవు

హనుమకొండ ర్యాలీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హనుమకొండ/ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడ్డ లక్షలమంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండలో ఆదివారం ఆయన బస్సు యాత్ర నిర్వహించారు. హనుమకొండ చౌరస్తా వద్ద కేసీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ చరిత్ర తెలియదు.. జాగ్రఫీ తెలిదని ఎద్దేవా చేశారు.

ఇబ్బడిముబ్బడి హామీలతో గద్దెనెక్కిన సీఎం చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే తెలంగాణ వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే పోరాట పటిమను చూపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్యవాదుల పాలనతో వరంగల్ వెనుకబడితే తెలంగాణ సాధించుకున్నాక ఎంతో అభివృద్ధి చేసుకున్నమని, ఆకాశమంత ఎత్తులో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, 5 మెడికల్ కాలేజీలను నిర్మించుకొన్నామని గుర్తుచేశారు. కాళేశ్వరం నీళ్లు వరంగల్ జిల్లాకు వస్తేనే పసిడి పంటలు పండాయని తెలిపారు. 

నాలుగు నెలల్లోనే ఆగమాగం

కాంగ్రెస్ వచ్చిన నాలుగైదు నెల్లోలనే రాష్ట్రంలో పాలన ఆగమాగం అయ్యిందని.. కరెంట్ కోతలు, సాగు నీరు లేక ఎండుతున్న పంటలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ ఎటుపోయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలే ఆలోచన చేసి లోక్‌సభ ఎన్నికల్లో ఓటెయ్యాలని కోరారు. ఎర్రిగా ఓటెయ్యొద్దొని సూచించారు. బీఆర్‌ఎస్ గెలిస్తేనే రాష్ట్రానికి క్షేమం అని పేర్కొన్నారు. బీజేపీ చాలా ప్రమాదరకమైన పార్టీ అని.. పంచాయితీలు, విద్వేషాలకు తెరలేపుతుందని కేసీఆర్ అన్నారు. దేశంలో బీజేపీకి 200 సీట్లు కూడా రావని తెలిపారు.

గోదావరి నీళ్లను మోదీ తీసుకుపోతుంటే సీఎం ఎందుకు పట్టించుకుంటలేరని నిలదీశారు. కడియం శ్రీహరి పార్టీ మారటం ద్వారా తన రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకున్నారని అన్నారు. మరో మూడునెలల్లో స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక ఖాయమని, రాజయ్య ఎమ్మెల్యే కావటం కూడా ఖాయమని స్పష్టంచేశారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ  ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, మాజీ స్పీకర్ మధుసుదనాచారి తదితరులు ఉన్నారు.