calender_icon.png 18 August, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలపై ఈ పక్షపాతమెందుకు?

14-08-2025 12:00:00 AM

బీసీల పట్ల రాజ్యంగ రచనలో ఈ పక్షపాత ధోరణి ఎందుకనేది మేధా వులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. అంటరానితనాన్ని ఆర్టికల్ 17 ద్వారా నిషేధించిన రాజ్యాంగం, దానిని రూపొందించిన నిర్మాతలకు పిచ్చకుంట్ల, బుడ బుక్కల మొదలైన సంచార కులాలు ఉన్నాయని తెలియదా? బూతు మాటలతో పిలువబడుతున్న ఆయా కులాల వారు తమ కులం పేరు మార్చుకోవడానికి సిగ్గుపడుతూ సిద్ధమవుతున్నారు.

నేక కులా ల వారు తమ చరిత్రను, వృత్తిని వదులుకొని ఏదో ఒకటి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారి ఆత్మగౌరవం కోసమో, అవకాశాల కోసమో.. ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నో పోరాటాల ఫలితంగా చివరికి ఇటీవలే అత్యంత వెనుకబడిన వారనీ పేర్కొంటూ వారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, బూతు మాటలతో ఉన్న కులాల పేర్లను మార్చాలని బీసీ కమీషన్లు ఆయా రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి.

21వ శతాబ్దంలో ఉన్నా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నా, సోషల్ మీడియాలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది అనుచరులను కలిగిన, అభివృద్ధి చెందిన, బీసీ నాయకుడి ఆధ్వర్యంలో బీజేపీ పాలనలో అగ్ర కులాల వారికి ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు కల్పించడం హాస్యాస్పదం. రాజ్యాంగ సవరణలో సెక్షన్ అనే పదాన్ని చేర్చడం కూడా విడ్డూరంగా అనిపిస్తోంది. సెక్షన్ అంటే అర్థమేమిటో ఆ భగవంతుడికే తెలియాలి. 

బీసీల బతుకులు ఇంతే..!

రిజర్వేషన్లకు ఆర్థిక అంశం ఆధారం కాదని, సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు మాత్రమే అర్హత అని ఆర్టికల్ 15(4), 16(4)లలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అగ్ర కులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించారు. వారు జనాభాలో ఎంత శాతం ఉన్నారో తేల్చకున్నా, లెక్కలు లేకున్నా, అగ్ర కుల, వామపక్ష, మితవాద, మధ్యేవాద, ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలన్నీ ఏకమై 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే, సుప్రీంకోర్టు కూడా 50 శాతం సీలింగ్ మించినా పట్టించుకోకుండా, వాటిని సమర్థించడం వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోవాలి.

ఆ పార్టీలన్నీ ఒక్క బీసీలకు తప్ప మిగతా వారందరికీ రిజర్వేషన్లను కల్పించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దురుద్దేశపూరితమైన, దుర్మార్గమైన ఆలోచన, మోసాన్ని, అగ్రకులాల రాజకీయాన్ని ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో సులభంగానే మేధావులు, బుది ్ధజీవులు అర్థం చేసుకోవచ్చు. కానీ మెజారిటీ బీసీ ప్రజలు ఇంత నిగూడ విషయాలను, చర్చించి అంచనాకు రాకుం డా, విద్య ద్వారా స్వాతంత్య్రానంతరం వర్ణ వ్యవస్థకు అనుగుణంగా సమాజాన్ని పునర్నిర్మించారు.

సమాజంలో ఉన్నటువంటి కులాల బేధాలను విద్యలో జొప్పించారు. కాబట్టి మా బతుకులు ఇంతే!.. అని చదువుకున్న బీసీ కూడా ఎలాంటి పరిష్కారం ఆలోచించి ప్రజల ముందు స్పష్టంగా పెట్టలేకపోతున్నారు. అందుకే బీసీలు దీనంతటికి మన ఖర్మ, తలరాత లేదా పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ బతికేస్తున్నారు. చివరికి సనాతన ధర్మంగా ఆరాధించడం చూస్తూనే ఉన్నాం.

బిచ్చగాళ్ల మాదిరిగా మార్చేసి..

చదువు ద్వారా బీసీలకు ఏమీ అర్థం కాకుండా చేసి విజయవంతం కావడంతో, ఇక చేయాల్సింది బీసీలను సంపద పెంపొందించుకోకుండా చేయడంతో పాటు అధికారానికి దూరంగా ఉంచడం. ఈ పనిని 80వ దశకంలో రాజీవ్ గాంధీ మొదలు పెడితే 90వ దశకంలో పి. వి. నరసింహారావు కాలం నుంచి దిగ్విజయంగా అమలు చేస్తూ పాలక అగ్రకుల పార్టీలు సఫలీకృతమయ్యాయినాయి.

అందుకోసం ఉదారవాదం, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి సంపదనంతా అగ్ర కులాల వారికి చేరేటట్టు విధాన నిర్ణయాలు తీసుకొని అమలు చేశారు. బీసీలను బిచ్చగాళ్ల మాదిరిగా మారుస్తూ గొర్రెలు, బర్రెలు, చాపలు మొదలైన పథకాలను అడుక్కునే విధానంలో అమల్లోకి తీసుకొచ్చారు. మరోవైపు ప్రపంచ వాణిజ్య సంస్థలో మన దేశాన్ని భాగస్వామిగా చేర్చి బహుళ జాతి సంస్థలు దేశంలోకి రావడానికి తలుపులు బార్లా తెరిచారు.

ఆర్ధిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కిచ్చారని , సంస్కరణల పితామహుడని పి. వి. నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని అన్ని పార్టీలు ఏకమై డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉదారవాద ఆర్థిక విధానాలను అత్యంత వేగంగా అమలు చేసి ఒక ప్రయోగశాలగా ఈ ప్రాంతాన్ని వాడుకున్నారు. ఈ విషయం కనిపెట్టిన బీసీ మేధావులు.. తెలంగాణలో ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం ప్రారంభించి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలను జోడించి ఉద్యమం మొదలుపెట్టారు.

ఉద్యమం ద్వారా రెండు దశాబ్దాలు పోరాడితే, వెయ్యికి పైగా విద్యార్థులు, ప్రజలు ఆత్మ బలిదానం చేస్తే 2014లో స్వరాష్ర్టం కల సాకారమైంది. చివరికి ఈ ఉద్యమాన్ని కూడా హైజాక్ చేసి అగ్ర కుల నాయకులందరూ ఏకమై ఒకరి తర్వాత మరొకరుగా రెండు అగ్ర కులాల పార్టీలే రాష్ట్రాన్ని ఏలడం శోచనీయం. గత ఎన్నికల్లో ‘బీసీ ముఖ్యమంత్రి’ అని నినాదమిచ్చి ఓట్లు దండుకున్న మరో అగ్ర వర్ణ/కుల పార్టీ కనీసం రాష్ర్ట పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి పార్టీలోని బీసీ నాయకులను మభ్యపెట్టడం దారుణమైన అంశం. 

బీసీలకు రాజ్యాధికారం వస్తేనే..

ఉద్యమంలో పాల్గొన్న నాయకులను క్రమంగా దూరం పెడుతూ తన కుటుంబ సభ్యులు, తమ కుల సభ్యులు, మరో అగ్ర కులాల నేతలను ప్రత్యేకంగా దగ్గర ఉంచుకొని రాష్ర్టం మొత్తాన్ని, అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని 10 సంవత్సరాల పాటు రాష్ర్టంలో అప్రజాస్వామిక పాలన కొనసాగింది. దీంతో ‘కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ’ అనే పుస్తకాన్ని రాసి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

అదే సమయంలో బీసీలకు రాజ్యాధికారం వస్తేనే బాగుపడతారని భావించి.. బీసీ అభ్యుదయ వాదులుగా పేరున్న రాజకీయ పార్టీల నేతలను కలిసి విషయం విన్నవిస్తే కనీసం స్పందించకుండా నవ్వి ఈసడించుకున్నారు. దాదాపు అన్ని పార్టీల్లోనే ఇదే వైఖరి ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి వాళ్లు ఎందుకు బీసీలకు అవకాశాలిస్తారు? వారు పుట్టిందే పాలించడానికనీ ప్రకటించుకున్న ప్రజాస్వామిక వాదులు కదా! అమాయకం కాకుంటే వారు అనుభవిస్తున్న పదవులన్నీ జనాభా ఎక్కువగా ఉన్న బీసీల నోట్లో మట్టికొట్టి దండుకుంటున్నవే కదా! వారిని అడగడమే మన తెలివి తక్కువతనం. ఇంకో విధంగా చెప్పాలంటే దీనిని బుద్ధి తక్కువ తనంగా భావించాలి.

గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టు ఇంతకాలం అగ్ర కుల పార్టీలను బీసీలు నమ్ముతూ వస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. అదేమిటంటే రాజకీయాలు ధనమయం కావడమే. కోట్లకొద్దీ పరోక్ష పన్నుల ద్వారా వస్తున్న మెజారిటీ బీసీ ప్రజల సంపదను ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించి, అందులో కమీషన్లు దండుకుంటున్నారు. అక్రమంగా వివిధ పథకాల ద్వారా డబ్బులు విచ్చలవిడిగా సంపాదించి, దాంట్లో కొంత ఎన్నికల్లో ఖర్చు చేసి,  ఓట్లకు నోట్లను వెదజల్లి, అర్రాసు  పాడినట్టు ఒక పార్టీ కన్నా మరో పార్టీ అధికంగా డబ్బులు పంచుతున్నారు.

బీసీలను అధికారం దరిదాపుల్లోకి రాకుండా చేయాలనే కుట్రలో భాగంగానే రాజకీయాలను డబ్బు బలం, కండ బలం, మీడియా బలంతో శాసిస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ ఎదుర్కొని మధ్య తరగతి బుద్ధిజీవులయిన బీసీలు అధికారంలోకి రావాలంటే ఏకైక మార్గం సహకార రాజకీయం నడపాల్సిన చారిత్రక అవసరముంది.

రచయిత: బీసీ మేధావుల వేదిక కోర్ కమిటీ సభ్యులు (8074701645)