18-08-2025 09:42:59 AM
- కురుస్తున్న వర్షాలకు అప్రమత్తత అవసరం
- ఇబ్బందులు ఉంటే 8712659360 సమాచారం ఇవ్వండి
- జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): కురుస్తున్న వర్షాల కారణంగా జాగ్రత్త అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ డి జానకి(District SP D Janaki) అన్నారు. సోమవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఎస్పీ పలు అంశాలను ప్రజలకు సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ప్రమాదంలో ఏర్పడితే వాటి నివారణకు పోలీస్ శాఖ జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు. వర్షాల వల్ల జిల్లా లో వాగులు ఉదృతంగా ప్రవహిస్తునందున ఏ ఆపద వచ్చిన వెంటనే లోకల్ పోలీస్ అధికారులకు, డయల్-100, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712659360 కు సమాచారం అందించాలని తెలిపారు.
వర్షాల వల్ల ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై గాని, ఇతర ప్రదేశాలలో గాని సమస్యలు తలెత్తిన వెంటనే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వర్షాల వల్ల కలిగే ప్రమాదాలపై తక్షణ స్పందన కలిగే విధంగా పోలీస్ అధికారులను సిద్ధం చేశామని తెలిపారు. వాగులు, చెరువులు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు, పశువులు కాపరులు వాగులు, వంకల వైపు వెళ్లరాదని, గ్రామాలలో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకునేందుకు గస్తీ పోలీసులను అప్రమత్తంగా ఉండేలా ఆదేశించామని తెలిపారు. పోలీస్ శాఖ తక్షణ సహాయక రక్షణ చర్యలు పేర్కొన్నారు.
సూచనలు పాటిద్దాం క్షేమంగా ఉందాం.. ఎస్పీ
నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున.. సరైన సూచనలు పాటించి క్షేమంగా ఉండాలని ఎస్పి సూచించారు.
1.వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు, వాటికి కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంది.
2.ఇనుప వైర్‌లపై బట్టలు ఆరబెట్టరాదు.
3.ఇంటి పైకప్పు ఇనుప రేకులను తాకరాదు.
4.శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, మట్టీ గోడల ఇండ్లలో ఉండరాదు.
5.రైతులు బావులు, బోర్ల వద్ద స్టార్టర్ బాక్స్‌లు, ఫ్యూజ్ బాక్స్‌లను తాకరాదు.
6.వరద నీటితో చెరువులు నిండిపోవడం వల్ల చెరువు కట్టలు తెగిపోవచ్చు. అప్రమత్తంగా ఉండండి.
7.చిన్నపిల్లలు, ఈత రాని వారు చెరువుల్లో ఈతకు లేదా చేపల వేటకు వెళ్ళరాదు.
8.వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలి. వర్షం వల్ల రహదారులు దెబ్బతిన్న గుంతలు ప్రమాదకరంగా మారవచ్చు.
9.డ్రైనేజి మ్యాన్‌హోల్స్ తెరిచి ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా నడవండి.
10.వర్షాల కారణంగా కల్వర్టులు, చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ప్రవహిస్తే వాహనాలతో దాటకండి.
11.అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని ఎస్పీ సూచించారు.