14 April, 2026 | 4:17 AM

అరైవ్.. అలైవ్ కార్యక్రమంతో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

14-04-2026 12:54 AM

భద్రంగా, సామాజిక బాధ్యతతో రోడ్డుపై వెళ్లాలి: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

కోనరావుపేట, ఏప్రిల్ 13 (విజయక్రాంతి):రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు భద్రంగా, సామాజిక బాధ్యతతో రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ప్రజాపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్.. అలైవ్ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి రోడ్డు భద్రతపై ఇచ్చిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు.

రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను చూపించిన ఆ వీడియో అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్తులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ ఛైర్మన్ తాళ్ళపల్లి ప్రభాకర్, గ్రామ సర్పంచ్ శ్రీహరి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బోయిని దేవరాజ్, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.