5 August, 2026 | 6:33 PM

బ్రిజ్ భూషణ్ నీడ నిలుస్తుందా?

20-05-2024 12:42 AM

లైంగిక ఆరోపణల ప్రభావం అంతంతమాత్రమేనా

కైసర్‌గంజ్ బరిలో బ్రిజ్ భూషణ్ కుమారుడు 

న్యూఢిల్లీ, మే 1౯: ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశం అవుతున్న స్థానం కైసర్‌గంజ్. అక్కడ ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు బీజేపీ ఆ స్థానంలో టికెట్ నిరాకరించి ఆయన కుమారుడిని రంగంలోకి దింపింది. కైసర్‌గంజ్ స్థానం నుంచి కరణ్ భూషణ్ సింగ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. కైసర్‌గంజ్ స్థానానికి బ్రిజ్ భూషణ్ మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో అగ్రశ్రేణి రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేశారు. అప్పటి నుంచి బ్రిజ్ భూషణ్ పేరు వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే రెజ్లింగ్ సమాఖ్య నుంచి వైదొలిగారు. అయితే జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన నేపథ్యంలో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తాజా ఎన్నికల్లో ఆయనను బీజేపీ పక్కన పెట్టింది. ఉత్తరప్రదేశ్‌లో అతి పెద్ద నేతగా బ్రిజ్ భూషణ్‌కు పేరుంది. భారీ సంఖ్యలో కేసులు ఉన్నా ఎంపీగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన స్వస్థలమైన గోండా చుట్టుపక్కల కనీసం ఆరు జిల్లాలో ఆయన హవా ఉంటుంది.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే బీజేపీ ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చింది. అయితే కైసర్‌గంజ్ స్థానంలో కరణ్ భూషణ్ విజయంపై రెజ్లర్ల తాలూకూ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థానంలో బ్రిజ్ భూషణ్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం అంత సులభం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులు పరిమిత ప్రభావం చూపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం అభ్యర్థిని చూడకుండా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కరణ్ భూషణ్‌కు మద్దతు ప్రకటిస్తున్నారని తెలుస్తోంది.