ఉచిత విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
- ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ
నేరేడుచర్ల,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.నీరజ అన్నారు. బుధవారం విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడుతూ,ఇంటర్ విద్యలో ప్రభుత్వం ఎన్నో మార్పులు తీసుకొస్తుందన్నారు.
ఉచిత విద్యతోపాటు,ఎన్నో సౌకర్యాలు, వసతులు కల్పించడం గర్వకారణం అన్నారు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఇప్పటికే ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తుండగా ఈ సంవత్సరం నుంచి నోటు పుస్తకాలు కూడా ఉచితంగా పంపిణీ చేయడం విద్యార్థులకు ఒక వరం లాంటిదన్నారు.
ఇంకా రాబోయే రోజుల్లో విద్యార్థులకు అందరికీ ఉచిత ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి మరియు తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గి పిల్లలు ఉన్నత చదువులు చదువుకోడానికి మంచి అవకాశాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.






